Warangal: ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర.. రూ.3230!
Warangal: వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. క్వింటాల్‌కు రూ.3,230 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Warangal: ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర.. రూ.3230!
Warangal: ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరొందిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్నకు ఆల్ టైం రికార్డు ధర నమోదైంది. క్వింటాల్ మొక్కజొన్నకు రూ.3230 ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించేందుకు ఏనుమాముల మార్కెట్ కు వస్తుంటారు. గత సంవత్సరం క్వింటాల్ మొక్కజొన్న 2000 నుండి 2300 రూపాయల వరకు పలకగా, ఈ సంవత్సరం మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 3230 రూపాయల ధర నమోదైంది.
ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం ఎకరాకు 35 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే, ఈ సంవత్సరం 25 నుండి 30 క్వింటాళ్లకే పరిమితమైందన్నారు.
అయినప్పటికీ మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు కొంత ఊరటనిస్తుందని వరంగల్ ఏనుమామూల మార్కెట్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రియాంక అంటున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే నష్టాల నుండి బయటపడతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ప్రియాంక మాట్లాడుతూ మొక్కజొన్నకు మంచి ధర వస్తోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.




