Mahabubabad: వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించి బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 14 Nov 2026 7:32 PM IST
Mahabubabad
X

Mahabubabad: వివేకవర్ధిని పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

మహబూబాబాద్: శ్రీ వివేకవర్ధిని పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు రంగురంగుల ఫ్యాషన్ దుస్తులు, సంప్రదాయ వస్త్రధారణలో పాఠశాలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు వివిధ రకాల సంప్రదాయ దుస్తులు ధరించి చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విద్యార్థుల ఉత్సాహం, సందడి పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని నింపాయి.

మరోవైపు హైస్కూల్ విద్యార్థులు, ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతిరోజూ విద్యార్థులుగా యూనిఫామ్ ధరించి, పుస్తకాల సంచులతో తరగతి గదులకు వచ్చే పదో తరగతి విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠశాలకు వచ్చి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు తరగతి గదుల్లో బాధ్యతగా పాఠాలు బోధిస్తూ, బోధనా అనుభవాన్ని పొందారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల బాధ్యతలు, విద్యాబోధనలోని కష్టాన్ని విద్యార్థులు స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది.

అనంతరం నిర్వహించిన సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, బాలలే దేశ భవిష్యత్తు, వారి నవ్వుల్లోనే సమాజ అభివృద్ధి దాగి ఉందన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, చిన్నారులే రేపటి భారతదేశానికి పునాదులని ఆయన విశ్వసించేవారని తెలిపారు. అందుకే పిల్లలపై ఆయనకున్న ప్రేమాభిమానాలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి వెలికితీసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు ఆసక్తి చూపాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మంచి విలువలు అలవర్చుకొని బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఆటపాటలు, నృత్యాలు, వేషధారణలు, స్వయం పరిపాలన కార్యక్రమాలతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బాలల దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చిర్ర నరేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD