Mahabubabad: మహబూబాబాద్‌లో పోలీసుల రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు
Mahabubabad: మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో డీఎస్పీ తిరుపతిరావు తనిఖీలు చేశారు. ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో పోలీసుల రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు
మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ రఘుపతి రెడ్డి మరియు పోలీసు సిబ్బందితో కలిసి రాత్రి వేళ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
రాత్రి సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అనుమానాస్పదంగా సంచరించడం, ఇతర అసాంఘిక మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, మహిళలు, ప్రయాణికులు మరియు సామాన్య ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రాత్రి వేళల్లో పోలీసుల నిఘా, పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.




