Mahabubabad: దసరా సెలవుల్లో విషాదం: కాకుల బోడు తండాలో చిన్నారి మృతి!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాకుల బోడు తండాలో నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు అక్షిత్ మృతి చెందాడు. దసరా సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు.

P PRABHAKAR, DORNAKAL
Updated on: 14 Oct 2026 3:56 PM IST
Mahabubabad
X

Mahabubabad: దసరా సెలవుల్లో విషాదం: కాకుల బోడు తండాలో చిన్నారి మృతి!

మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 14: దసరా సెలవుల్లో సరదాగా అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఇప్పటికే మొదటి కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులకు రెండో సంతానమైన కుమారుడు కూడా దూరం కావడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ గ్రామ పరిధిలోని కాకుల బోడు తండాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ ఐదో వార్డుకు చెందిన బోడ హరీష్–అరుణ దంపతుల కుమారుడు అక్షిత్ (9) కేరళ గ్లోబల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అక్షిత్ అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డాడు.

వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న హరీష్ కుటుంబానికి ఈ ఘటన తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహమై 12 సంవత్సరాలు గడిచిన ఈ దంపతులు ఇప్పటికే తమ మొదటి కుమార్తెను చిన్నతనంలోనే కోల్పోయారు. తాజాగా రెండో సంతానమైన అక్షిత్ కూడా మృతి చెందడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

పండుగ సెలవుల్లో ఆనందంగా గడపాల్సిన చిన్నారి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి అక్షిత్ మృతితో మరిపెడ మున్సిపాలిటీ ఐదో వార్డులో విషాదఛాయలు అలుముకున్నాయి.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL