Guduru: దారి వివాదం, కులం పేరుతో దూషణ వృద్ధురాలు ఆత్మహత్య
Guduru: గూడూరు మండలంలో దారి వివాదం నేపథ్యంలో కులం పేరుతో దూషించడంతో వృద్ధురాలు ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Guduru: దారి వివాదం, కులం పేరుతో దూషణ వృద్ధురాలు ఆత్మహత్య
గూడూరు: దారి వివాదంలో మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గూడూరు మండల పరిధిలోని భూపతిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భూపతిపేట గ్రామానికి చెందిన తేజావత్ ద్వాలి (69) తన సొంత భూమి నుండి 12 అడుగుల వెడల్పు గల దారిని 2022లో జక్కుల మునేష్‌కు విక్రయించారు. అయితే కొంతకాలంగా ఈ దారి విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబరు 23, 2026) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో దారి విషయంలో జక్కుల రజిత, తేజావత్ ద్వాలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రజిత తనను కులం పేరుతో దూషిస్తూ, అసభ్య పదజాలంతో తిడుతూ, "చచ్చిపో" అంటూ బెదిరింపులకు పాల్పడి తీవ్రంగా అవమానించినట్లు సమాచారం.
రజిత ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ద్వాలి, ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (సెప్టెంబరు 24, 2026) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందారు.
మృతురాలి మనవడు తేజావత్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు గూడూరు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.




