Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహిళలు పాలాభిషేకాలు చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 13 Nov 2026 2:33 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా నాగుల చవితి వేడుకలు

మహబూబాబాద్: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి దేవాలయంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఆలయంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహిళా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న మహిళలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకాలు, పాలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు చేసి పాలు, పూలు, వివిధ నైవేద్యాలను సమర్పించి దీపారాధన చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాలరాతి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.స్వామివారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులు బారులు తీరారు.

తమ కుటుంబాల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సంతాన సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నాగేంద్ర స్వామికి పాలాభిషేకం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.నాగుల చవితి సందర్భంగా ఆలయమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మార్మోగింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలను అందజేశారు.నాగుల చవితి పర్వదినం సందర్భంగా నాగేంద్ర స్వామిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకలు ఆలయంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad