Warangal: కేయూ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: ఎమ్మెల్యే నాయిని!

Warangal: కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగులు, అధ్యాపకులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Nov 2026 4:42 PM IST
Warangal
X

Warangal: కేయూ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: ఎమ్మెల్యే నాయిని!

వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ.. తాను కాకతీయ విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడలిస్ట్‌గా విద్యాభ్యాసం పూర్తి చేసి, అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పొందానని తెలిపారు. ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య అనంతరం క్యాపిటల్ వన్ బ్యాంక్‌లో పనిచేసి అమెరికా, కెనడా, లండన్ తదితర దేశాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు.

రాజకీయ వ్యవస్థకు, కార్పొరేట్ రంగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 14 వేల కిలోమీటర్లు ప్రయాణించి పట్టభద్రులను కలిశానని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలానికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో 489 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 77 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఇంకా 332 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలపై ఇటీవల మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించామని చెప్పారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా అందుబాటులో ఉంటూ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై స్వతంత్రంగా తన గళాన్ని వినిపిస్తానని, సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారానికి పోరాడుతానని హామీ ఇచ్చారు. తన తండ్రి టైగర్ దామోదర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ, ప్రజల గుండెల్లో సంపాదించిన స్థానమే తమ కుటుంబానికి గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.