Jangaon: నిబంధనల ప్రకారం ఫామ్ పాండ్లు నిర్మించాలి: కలెక్టర్!
Jangaon: పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో ఫామ్ పాండ్ నిర్మాణాలను జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
Jangaon: నిబంధనల ప్రకారం ఫామ్ పాండ్లు నిర్మించాలి: కలెక్టర్!
జనగామ: పంటల సాగుకు నీటి కొరత లేకుండా, వర్షపు నీటిని ఒడిసిపట్టి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకునేందుకు చేపడుతున్న ఫామ్ పాండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం, జిల్లాలోని పాలకుర్తి మండలంలోని అయ్యంగారిపల్లి గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫామ్ పాండ్ల నిర్మాణ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత లోతు, ఎత్తు, పొడవులతో ఫామ్ పాండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఐదు ఫామ్ పాండ్ల చొప్పున ఎంపిక చేసి, వాటి నిర్మాణ పనులను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
నిర్మాణ పనులకు ప్రతిరోజూ ఎంత మంది కూలీలు హాజరవుతున్నారు, వారికి ఎంత మేర కూలి చెల్లిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల హాజరును తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రిక పరికరాలపై అందిస్తున్న సబ్సిడీల గురించి అవగాహన కల్పించాలని, నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో డీఆర్డీఓ భాస్కర్, ఎంపిడిఓ వేదవతి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




