Jangaon: జీడికల్ దేవస్థానాన్ని దేశవ్యాప్త పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి!

Jangaon: లింగాలఘనపూర్ మండలం జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 25 Nov 2026 1:20 PM IST
Jangaon
X

Jangaon: జీడికల్ దేవస్థానాన్ని దేశవ్యాప్త పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి!

జనగామ: లింగాల ఘనపూర్ మండలం జీడికల్ లోని శ్రీ వీరాచల రామచంద్ర స్వామి ఆలయ ధర్మ కర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు. అనంతరం ఆలయ ధర్మ కర్తల కమిటీ చైర్మన్ మరియు సభ్యులతో ఆలయ ఈవో, ఎండోమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ గుర్రం బాలరాజు గౌడ్ మరియు కమిటీ సభ్యులకు ఎంపీ డా. కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జీడికల్ రామచంద్ర స్వామి వారి ఆలయానికి ఉన్న చరిత్ర, ప్రాశాస్థ్యం చాలా గొప్పదని అందువల్లే మన జీడికల్ ఆలయానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. గతంలో జీడికల్ రామచంద్ర స్వామి ఆలయం నుండే యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి నిధులు వెళ్లెవని అన్నారు. నవంబర్ 23 నుండి డిసెంబర్ 05వరకు జరగనున్న శ్రీ వీరాచల రామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు నూతన ఆలయ ధర్మకర్తల కమిటీ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి, దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

నేను ఎమ్మెల్యేగా తర్వాత మూడో స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మూడు సంవత్సరాలలో ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు 3కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అలాగే జీడికల్ నుండి జనగామ వరకు 8కోట్లతో రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. జీడికల్ ఆలయానికి ఉన్న ప్రాశాస్త్యాన్ని పెంపొందించే విధంగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 24గంటలు త్రాగు నీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ రోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ కమిటీ సభ్యులు దేవుని సేవకులుగా పని చేయాలని అన్నారు. రానున్న రోజులలో జీడికల్ ఆలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ....

కాకతీయుల కాలం నాటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి దేవస్థానాన్ని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వపరమైన సహకారంతో పాటు తన ఎంపీ నిధులను కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాష్ట్రంలోని యాదాద్రి, స్వర్ణగిరి వంటి పుణ్యక్షేత్రాలతో పాటు దేశంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరుగుతోందని తెలిపారు. అదే స్థాయిలో జీడికల్ దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేవాలయాలకు వచ్చే భక్తులు కేవలం దర్శనం మాత్రమే కాకుండా ఆలయ పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను కూడా గమనిస్తారని ఎంపీ పేర్కొన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు సుమారు 40 నుంచి 50 వేల మంది భక్తులు హాజరైనట్లు తెలుస్తుందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే వచ్చే ఏడాది లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జీడికల్ దేవస్థానానికి మంచి పేరు రావాలంటే ప్రతి శాఖ 100 శాతం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

జీడికల్‌ ఆలయంలో భక్తులకు శాశ్వత వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ఆలోచించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాల సమయంలో మూడు రోజుల పాటు భక్తులు ఇక్కడే ఉండేలా గెస్ట్‌హౌస్‌లు, గెస్ట్‌రూమ్‌లు నిర్మించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని అన్నారు.

ఇప్పటికే తన ఎంపీ నిధుల నుంచి దేవస్థానం వద్ద హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచనల మేరకు ఎంపీ నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అదేవిధంగా ఒక స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) సహకారంతో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు జీడికల్‌కు తరలివచ్చేలా పుణ్యక్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపీరామ్, తహసీల్దార్, ఎంపిడివో, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం బాలరాజు గౌడ్, డైరెక్టర్లు, స్థానిక సర్పంచ్ కొండబోయిన మమత, మాజీ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఎండోమెంట్ అధికారులు, పూజారులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.