Jangaon: గూడూరులో మేకల దొంగల ముఠాను పట్టుకున్న రైతులు!

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో మేకల దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రైతులు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించిన వైనం!

S MAHENDER, PALAKURTHI
Published on: 18 Oct 2026 3:10 PM IST
Jangaon
X

Jangaon: గూడూరులో మేకల దొంగల ముఠాను పట్టుకున్న రైతులు!

Jangaon: జనగామ జిల్లాలో మూగజీవాల దొంగల ముఠా ఆగడాలకు రైతులు చెక్ పెట్టారు. దసరా దావత్ గట్టిగా చేసుకుందామనుకున్నారో ఏమో కానీ ఏకంగా 12 మేకలను ఎత్తుకెళ్లారు పాలకుర్తి మండలం గూడూరులో ఏకంగా 12 మేకలను ఎత్తుకెళ్లిన దొంగలను రైతులు చాకచక్యంగా పట్టుకున్నారు. గ్రామంలోని రైస్ మిల్లు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కనుగొని పోలీసులకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు మరో నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చోరీకి గురైన 12 మేకల్లో కేవలం 6 మాత్రమే రికవరీ కావడంతో, తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న జీవాలు మాయమవుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో తరచూ జరుగుతున్న గొర్రెలు, మేకల దొంగతనాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా గ్రామానికి చెందిన నాయిని రవి అనే రైతుకు చెందిన ఏకంగా 12 మేకలను గుర్తుతెలియని దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. మేకలు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు బాధితుడు.

గతంలో పలుమార్లు ఇలాగే జీవాలు చోరీకి గురైనా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ ఈసారి రైతులు ఊరుకోలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. అనుమానాస్పదంగా సంచరించిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి, పక్కా సమాచారంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితులను పాలకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు.

రైతులు అప్పగించిన నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాలో మరొకరికి ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. కాగా, చోరీకి గురైన 12 మేకల్లో పోలీసులు ఇప్పటివరకు 6 మేకలను మాత్రమే రికవరీ చేసి రైతు నాయిని రవికి అప్పగించారు. రెక్కాడితే గానీ డొక్కాడని తమలాంటి పేద రైతులను దొంగలు నిలువునా ముంచుతున్నారని, మిగిలిన 6 మేకలను కూడా రికవరీ చేసి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని బాధిత గొర్రెల కాపరి రవి పోలీసులను కన్నీటిపర్యంతమై కోరుతున్నాడు.

"రాత్రంతా కష్టపడి సాదుకున్న మేకలను ఒక్క పెట్టు లో ఎత్తుకెళ్లారు సార్. సీసీ కెమెరాల వల్ల దొంగలు దొరికారు. కానీ నాకు ఆరు మేకలే ఇచ్చారు, ఇంకా ఆరు రావాలి. పోలీసులు పెద్దమనసు చేసుకుని నా మిగతా మేకలను కూడా ఇప్పించి న్యాయం చేయాలి..."

సీసీ కెమెరాల నిఘా ఎంత అవసరమో గూడూరు రైతులు నిరూపించారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి మిగిలిన నిందితులను పట్టుకోవడం అభినందనీయం. అయితే బాధితుడికి మిగిలిన ఆరు మేకలను కూడా త్వరలోనే రికవరీ చేసి అప్పగిస్తారని ఆశిద్దాం.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI