Jangaon: జనగామ ప్రజావాణికి 298 వినతులు.. తక్షణ పరిష్కారానికి ఆదేశం!
Jangaon: జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 298 అర్జీలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Jangaon: జనగామ ప్రజావాణికి 298 వినతులు.. తక్షణ పరిష్కారానికి ఆదేశం!
జనగామ: ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా (298) అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాలను వేగవంతం చేయాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి.
జిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు సంఘాలు, వార్తాపత్రికలు, మీడియా సంస్థల ప్రతినిధులు, వార్తాపత్రికలు, మీడియా సంస్థలకు వచ్చే అర్హత గల ప్రకటనల ఆదాయంలో 10 శాతం వాటాను జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించాలని, ప్రభుత్వం తరపున అదనంగా 3 శాతం వాటా అందించాలని, ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి, పారదర్శక ఆడిటింగ్‌తో నిధిని నిర్వహించాలని, అర్హులైన పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
జనగామ పట్టణానికి చెందిన గజ్జెల నరేష్, తన కుమారుడు గజ్జెల సుధాన్ష్‌కు 91 శాతం వినికిడి లోపం ఉన్నందున దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేసియున్నారు. పాలకుర్తి మండలం, సిరిసన్నగూడెం గ్రామానికి చెందిన సంసి కొమురమల్లు, తన పట్టా భూమికి సంబంధించి ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఈ మేరకు విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయగలరని విన్నవిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.
జఫర్‌గఢ్ మండలం, తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద రాజయ్య, తన భూమికి సంబంధించి తనకు బదులుగా తన సోదరుడి పేరున పట్టా నమోదైందని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందించారు.
పటేల్ గూడెం గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన జోగు యాదయ్య, వికలాంగుల పింఛను ఇప్పించగలరని అభ్యర్థిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రజావాణిలో జెడ్పీ సీఈవో బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




