Warangal: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు పెరగాలి: సీఎస్

Warangal: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యా నిధులు, ఉపాధి హామీ, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల పనులపై దిశానిర్దేశం చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 6 Nov 2026 5:43 PM IST
Warangal
X

Warangal: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు పెరగాలి: సీఎస్

Warangal: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని, విద్య, VBGRAMG పథకం, చేయూత పింఛన్ల వెరిఫికేషన్, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు సూచించారు.

శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, లక్ష్యాల సాధనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ కలెక్టరెట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరయ్యారు.

ఈ వీసీ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు మాట్లాడుతూ, సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని సీఎస్ సూచించారు. జనవరి మొదటి వారంలోగా ఈ రెండు పథకాల నిధుల వ్యయాన్ని గరిష్టంగా 100 శాతానికి చేరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

పీఎంశ్రీ పథకం కింద మొత్తం రూ.538 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పటివరకు 10 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 794 పాఠశాలలను పీఎం శ్రీ పాఠశాలలుగా ఎంపిక చేశామని, ఆయా పాఠశాలల్లో నిధుల వినియోగంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ఫలితాల మెరుగుదలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

పీఎం శ్రీ నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రతి 10 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.1,763 కోట్లు కేటాయించగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.960 కోట్లు ఉందని, ఇప్పటివరకు కేవలం రూ.79 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిధుల వినియోగంలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తోందని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్, VBGRAMG పథకాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదులు, అవసరమైన మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ముఖ్యమంత్రి డాష్‌బోర్డులో ఉన్నాయని, ప్రతి జిల్లా పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ ఏడాది పాఠశాల యూనిఫారాలు, విద్యార్థుల కిట్ల పంపిణీలో జరిగిన జాప్యాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో పునరావృతం కాకుండా చూడాలని, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫారాలు, కిట్లు అందేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

అన్ని పాఠశాలలను అధికారులు తరచూ సందర్శించి, అక్కడి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలు అన్ని పాఠశాలల్లో నాణ్యతతో అమలయ్యేలా చూడాలని తెలిపారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత

వేసవి కాలం ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ సంజయ్ జాజ్జు సూచించారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించేందుకు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

మంజూరైన నిధులతో ప్రైవేట్ బోర్‌వెల్ వనరులను వినియోగించుకోవడం, దూర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని రవాణా చేయడం, అవసరమైతే కొత్త బోర్‌వెల్లు తవ్వించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియను నవంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో జిల్లా తాగునీటి కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ కమిటీల్లో జిల్లా పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు సభ్యులుగా ఉండాలని తెలిపారు.జిల్లా కమిటీ ప్రతి వారం సమావేశమై తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని, నవంబర్ నెలాఖరులోగా మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నవంబర్ 15వ తేదీలోగా చేతిపంపులు, బోర్ పంపులు, బహిరంగ బావులు తదితర తాగునీటి మౌలిక సదుపాయాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.

నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సరఫరాలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ పైప్‌లైన్లలో ప్రెజర్ వాల్వ్‌లను నిరంతరం పర్యవేక్షించాలని, నీరు వృథా కాకుండా చూడాలని, అక్రమ నీటి కనెక్షన్లు, అక్రమ ట్యాపింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

VBGRAMG ద్వారా నాణ్యమైన పనులు చేపట్టాలి

VBGRAMG పథకం అమలుపై మాట్లాడుతూ, నవంబర్ నెలలో ప్రస్తుతం రోజుకు సగటున 5.5 లక్షల మంది కూలీలు పనులు పొందుతున్నారని సీఎస్ తెలిపారు. గత రెండేళ్లతో పోలిస్తే ఉపాధి కల్పనలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.గత సంవత్సరాల్లో నవంబర్ నెలలో సగటున 25 వేల మందికి మాత్రమే పనులు కల్పించగా, ప్రస్తుతం రోజుకు దాదాపు 5.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.

VBGRAMG ద్వారా చేపట్టే పనులు నాణ్యతతో ఉండాలని, మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. అవసరమైన కొత్త సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి, తగిన హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రారంభించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమంలో భాగంగా పూర్తయిన అన్ని ఇందిరమ్మ ఇళ్లకు కొత్త లోగోతో కూడిన స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహించే వేడుకలను సోషల్ మీడియా ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఇప్పటివరకు కేవలం 43 వేల ఇళ్లకు మాత్రమే మంజూరు చేయడం జరిగిందని, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీలతో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు, మొదటి విడతలో మరో లక్ష ఇళ్ల మంజూరు ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ద్వారా సుమారు 10 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పనకు కూడా అవకాశం ఉందని తెలిపారు.ఇసుక ధరలు కొన్ని జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించే విషయంలో “మన ఇసుక – మన వాహనం” యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సీఎస్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందించాలని, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఇసుక ద్వారా పొందుతున్న ప్రయోజనాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.230 చొప్పున సరఫరా చేయాలని, ఒక్కో బస్తాపై లబ్ధిదారుడికి రూ.100 ప్రయోజనం కలుగుతుందని, మొత్తం సుమారు రూ.50 వేల వరకు ప్రయోజనం అందే అవకాశం ఉందని తెలిపారు.

సబ్సిడీ సిమెంట్ బస్తాల ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనం పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజ్జు ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల ) వైవీ గణేష్ డియార్వో విజయలక్ష్మి,

డిఆర్డీఓ నాగ పద్మజ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST