Hanumakonda: పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి!
Hanumakonda: హనుమకొండ జిల్లాలో అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సూచించారు.
Hanumakonda: పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి!
హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, అవగాహన కార్యక్రమం, జిల్లాలో 2023 అక్టోబర్ 31 నాటికి పట్టబద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్వీప్ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని టీజీవో, టీఎన్జీవో, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ల ప్రతినిధులకు సూచించారు. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ మంది అర్హులు నిర్ణీత గడువులోగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. వాకర్స్ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ల సహకారంతోనూ ఓటరు నమోదుపై ప్రచారం చేపట్టాలని తెలిపారు. పబ్లిక్ గార్డెన్, ఆర్ట్స్ కాలేజీ వంటి పట్టభద్రులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని అధికారులకు తెలియజేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లోని వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధులు ముందుకొస్తే వారి సహకారంతో ఓటరు నమోదు ప్రక్రియను మరింత విస్తృతం చేయవచ్చని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాను ప్రతిసారీ కొత్తగా రూపొందించే ప్రక్రియ చేపడతారని, గతంలో ఓటరుగా నమోదు చేసుకున్నవారి పేర్లు ప్రస్తుత జాబితాలో కొనసాగవని స్పష్టం చేశారు. అందువల్ల అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా కొత్తగా జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ప్రతి పట్టభద్రుడికి ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంపై తమ వంతుగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, స్వీప్ నోడల్ అధికారి మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, రెడ్ క్రాస్ పాలక వర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, ఇతర అధికారులతో పాటు టీజీవో, టీఎన్జీవోస్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కెయూ ప్రొఫెసర్లు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




