Hanumakonda: ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్
Hanumakonda: హనుమకొండ దీక్షా దివస్ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ కరువు తెచ్చిందని విమర్శించారు.
Hanumakonda: ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్
హనుమకొండ: దీక్షా దివస్ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. చావు నోట్లో తల పెట్టి "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" అనే మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని, ఆ దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.
కాళేశ్వరం వల్ల పంటల దిగుబడి పెరిగింది
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంటల దిగుబడి పెరిగిందని, ఎండాకాలం అనే తేడా లేకుండా చెరువులు మత్తడి పోశాయని అన్నారు. రైతుల బావులు, బోర్లు నీటితో నిండి కళకళలాడాయని చెప్పారు.
కానీ ఇప్పుడు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చిందని విమర్శించారు. కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేయడం వల్ల రైతులకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులను స్మరించుకున్న చల్లా
తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




