Hanamkonda: భద్రకాళి అమ్మవారి నూతన రథాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని!
Hanamkonda: హనుమకొండ భద్రకాళి ఆలయంలో నూతన రథాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. వరంగల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు హామీ.
Hanamkonda: భద్రకాళి అమ్మవారి నూతన రథాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని!
హనుమకొండ: వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి, రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ (ఎడిషన్-2)ను ప్రారంభించిన అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి నగరంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. తొలుత శ్రీ పద్మాక్షి అమ్మవారిని దర్శించుకుని హోమపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి శ్రీమతి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి కూడా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పే శ్రీ భద్రకాళి అమ్మవారి రథ నిర్మాణ పనులు పూర్తికావడంతో, ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. మాడవీధుల్లో ఊరేగింపునకు సిద్ధమైన అమ్మవారి రథం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు.
అనంతరం ప్రముఖ శైవక్షేత్రమైన వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి వద్ద కూడా పూజల్లో పాల్గొన్నారు. వరంగల్ నగరం చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత వారసత్వ సంపదను కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వరంగల్, హనుమకొండ నగరాల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల అధికారులు, ప్రధాన అర్చకులు, పురోహితులు మంత్రికి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు.




