Parkal: పరకాల 22వ వార్డులో పూర్తిగా అస్తవ్యస్తమైన పారిశుధ్య వ్యవస్థ!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల 22వ వార్డులో పూర్తిగా విఫలమైన పారిశుధ్యం. రోడ్లపైనే భారీగా పేరుకుపోయిన చెత్త కుప్పలు, మురుగునీరు. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం.

M PRABHAKAR, PARAKAL
Published on: 3 Nov 2026 8:10 AM IST
Parkal
X

Parkal: పరకాల 22వ వార్డులో పూర్తిగా అస్తవ్యస్తమైన పారిశుధ్య వ్యవస్థ!

Parkal: పరకాల పరకాల మున్సిపాలిటీ 22వ వార్డు పద్మశాలి వీధి, ముదిరాజ్ వాడలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రధాన రోడ్డు పక్కనే భారీగా చెత్త కుప్పలు పేరుకుపోయి వీధులన్నీ దుర్వాసనతో నిండిపోయాయి. స్థానికులు ముక్కు మూసుకుని తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

ప్లాస్టిక్ వ్యర్థాలు, పూల చెత్త, ఇంటి వ్యర్థాలతో రోడ్డు చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది. పక్కనే ఉన్న డ్రైనేజీ కాల్వ పూర్తిగా చెత్తతో మూసుకుపోయి మురుగునీరు రోడ్డుపైకి పొంగి ప్రవహిస్తోంది. దోమల బెడద విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వెంటనే చెత్త కుప్పలను తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేసి పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL