Hanamkonda: డిసెంబరులో జాతీయ క్రీడా సంబరం జేఎన్‌ఎస్ స్టేడియం పరిశీలన

Hanamkonda: హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో డిసెంబరులో జాతీయ స్థాయి ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 22 Oct 2026 7:46 PM IST
Hanamkonda
X

Hanamkonda: డిసెంబరులో జాతీయ క్రీడా సంబరం జేఎన్‌ఎస్ స్టేడియం పరిశీలన

హనుమకొండ: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్‌) మరో ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు వేదిక కానుంది. డిసెంబరులో నిర్వహించనున్న ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి గురువారం జేఎన్‌ఎస్‌ స్టేడియాన్ని సందర్శించి, పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేడియంలోని క్రీడా ప్రాంగణం, క్రీడాకారులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జాతీయ స్థాయి పోటీలకు హనుమకొండ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.

క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలి

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు.

వసతి, పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్‌కు ఆదేశించారు. పోటీల సమయంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

స్టేడియంలో కొత్తగా నిర్మిస్తున్న మరుగుదొడ్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, క్రీడా పోటీలు ప్రారంభమయ్యేలోపు అన్ని ఏర్పాట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.