Hanamkonda: టీజీపీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Hanamkonda: హనుమకొండ జిల్లాలో నవంబర్ 12, 13 తేదీల్లో టీజీపీఎస్సీ డీఈవో పరీక్షలు. 3,650 మంది అభ్యర్థుల కోసం పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 7:35 PM IST
Hanamkonda
X

Hanamkonda: టీజీపీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీస్సీ) నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో/ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1) పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు నిర్వహణపై సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులతో పాటు పరీక్షా కేంద్రాల ప్రతినిధులతో ఏర్పాట్ల సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో / గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-1) పరీక్షకు కేటాయించిన పరీక్షా కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి ఐదు సాయంత్రం 5'00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

12వ తేదీన జరగనున్న పరీక్షకు 1825 మంది అభ్యర్థులు, 13వ తేదీన జరగనున్న పరీక్షకు 1825 మంది అభ్యర్థులు( మొత్తం పరీక్ష రాసే అభ్యర్థులు( 3650 ) పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ వడ్డేపల్లి లోని అయాన్ డిజిటల్ జోన్, ములుగు క్రాస్ రోడ్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఎదురుగా ఉన్న శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, రామారం( భీమారం) పొద్దుటూరి గార్డెన్స్ సమీపంలోని మోక్షిత్ కంప్యూటర్స్, హనుమకొండ గోపాల్ పూర్ కల్లుమండవ సమీపంలోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హసన్పర్తి చింతగట్టు హైవే సమీపంలోని నోబెల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లలో పరీక్ష జరుగుతుందన్నారు.

జిల్లాకు సంబంధించి 3,650 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్, ఇతర అధికారులతో పాటు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఆయా పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్