Warangal: జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Warangal: గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కుడా చైర్‌పర్సన్ సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 16 Oct 2026 10:00 PM IST
Warangal
X

Warangal: జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

వరంగల్: గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు శుక్రవారం సాయంత్రం సంస్థ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకల్లో కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న దంపతులు, మహిళా ఉద్యోగులు, ఇతర సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. పూల సోయగాలు, జానపద గీతాలు, మహిళల ఆటపాటలతో జీడబ్ల్యూఎంసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే పూలను పూజిస్తూ, ప్రకృతితో మానవ జీవితానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని తెలిపారు.

బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, మహిళల ఆత్మగౌరవం, ఐక్యత, కుటుంబ అనుబంధాలు, సామాజిక సమైక్యతకు ప్రతిబింబమని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడటంతోపాటు మహిళల్లో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకునేలా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు కమిషనర్ వెంకన్న తెలిపారు. నగర పరిశుభ్రత, రవాణా, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

బతుకమ్మ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, ఇతర మహిళలు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST