Jangaon: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి - రాష్ట్ర సీఈవో!
Jangaon: జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. ఫారం-6, 7, 8 దరఖాస్తులను అక్టోబర్ 25లోపు పూర్తి చేయాలని ఆదేశం.
Jangaon: ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి - రాష్ట్ర సీఈవో!
Jangaon: ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
సోమవారం, హైదరాబాదు నుంచి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు ఫారం-6, 7, 8 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ముందుగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అక్టోబర్ చివరి వారంలోగా అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్ 25లోపు పూర్తి చేయాలని, చివరి 10 రోజులను చివరి క్షణంలో అవసరమయ్యే సవరణలు, ఇతర ప్రక్రియల కోసం కేటాయించుకోవాలని ఆదేశించారు.
ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని స్పష్టం చేశారు. ఫారం-6తో పాటు అవసరమైన డిక్లరేషన్, సంబంధిత పత్రాలను సమర్పించేలా అర్హులైన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
అవసరమైన సందర్భాల్లో బీఎల్‌ఏలు ఇళ్లను గుర్తించడంలో సహకరించవచ్చని తెలిపారు. బీఎల్‌ఏ ద్వారా నోటీసులు పంపిణీ చేసినట్లు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌ఓపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరపున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై, సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయంపై బీఎల్‌ఓలు సంబంధిత ఓటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.
బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం వంటి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.




