Jangaon: దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపాలి.. సీపీఎం డిమాండ్!
Jangaon: దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ జిల్లాలోని చెరువులను నింపాలని, అలాగే అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు.
Jangaon: దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపాలి.. సీపీఎం డిమాండ్!
Jangaon: జిల్లాలోని రైతుల సాగునీటి కష్టాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు ద్వారా జూలై నెల నుంచే జిల్లాలోని చెరువులను నింపాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి చెరువుల్లోకి నీటిని విడుదల చేయకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అన్ని చెరువులను నింపేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుందని, తద్వారా రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లాలో కేవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదని అన్నారు. మిగతా మండలాల్లోని రైతులకు కూడా కరువు పరిస్థితుల ప్రభావం ఉందని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపడంతో పాటు, జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.




