Warangal: పౌల్ట్రీ రంగానికి డాక్టర్ బి.వి. రావు సేవలు చిరస్మరణీయం!
Warangal: పద్మశ్రీ డాక్టర్ బి.వి. రావు 91వ జయంతి, NECC డే సందర్భంగా వరంగల్ బి.వి. రావు భవన్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించి, ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు గుడ్లు పంపిణీ చేశారు.
Warangal: పౌల్ట్రీ రంగానికి డాక్టర్ బి.వి. రావు సేవలు చిరస్మరణీయం!
Warangal: పౌల్ట్రీ రంగ పితామహుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ బి.వి. రావు గారి 91 వ జన్మదినం మరియు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) డే సందర్భంగా హంటర్ రోడ్డులోని బి.వి. రావు భవన్లో ఆయన విగ్రహానికి NECC వరంగల్ జోనల్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు, వరంగల్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మార్తినేని ధర్మారావు గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ.. భారతదేశంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధికి డాక్టర్ బి.వి. రావు గారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
దేశంలో కోళ్ల పరిశ్రమను వ్యవస్థీకృత రంగంగా అభివృద్ధి చేయడంతో పాటు, పౌల్ట్రీ రంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి లక్షలాది మంది రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. నాణ్యమైన కోడిగుడ్లు, కోడి మాంసం ఉత్పత్తి ద్వారా దేశ ప్రజలకు పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
గుడ్డు సంపూర్ణ పోషకాహారానికి ప్రతీక
ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రదీప్ రావు గారు సూచించారు. గుడ్డులో శరీర ఎదుగుదలకు అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయని, పిల్లల ఎదుగుదలకు, విద్యార్థుల ఆరోగ్యానికి, పెద్దల శారీరక దృఢత్వానికి గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే గుడ్డు అత్యుత్తమ పోషకాహార వనరులలో ఒకటని, గుడ్డు వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
అనంతరం NECC డే సందర్భంగా సామాజిక బాధ్యతలో భాగంగా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు ఉడకబెట్టిన కోడిగుడ్లను పంపిణీ చేశారు. పోషకాహారం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు, పౌల్ట్రీ రైతుల కృషిని గుర్తు చేస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
డాక్టర్ బి.వి. రావు గారి ఆశయాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగ అభివృద్ధికి, కోళ్ల రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ, ప్రజల్లో గుడ్డు వినియోగంపై అవగాహన కల్పించేందుకు NECC నిరంతరం ముందుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వీరితోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ కోళ్ల రైతులు రామారావు, సుబ్రహ్మణ్యం, హరిబాబు,శ్రీనివాస్ రెడ్డి,రాంప్రసాద్, కర్ణాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రమణారెడ్డి, రాజేందర్, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రవికుమార్, యుగేందర్రావు, NECC స్టాఫ్ వినయ్ మరియు సుమన్ తదితరులు పాల్గొన్నారు.




