Dharmasagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు కడియం శ్రీహరి, కావ్య

Dharmasagar: ధర్మసాగర్ మండలంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 4:34 PM IST
Dharmasagar
X

Dharmasagar: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు కడియం శ్రీహరి, కావ్య

ధర్మసాగర్: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పింఛన్ల మంజూరుకు ఎలాంటి టార్గెట్ లేదని, నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు.

ధర్మసాగర్ మండలంలోని సుష్మిత గార్డెన్స్‌లో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధర్మసాగర్, రాంపూర్ గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు రూ.19.43 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు, 27 మంది లబ్ధిదారులకు రూ.27.03 లక్షల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అలాగే తుర్కకాశ గ్రామానికి చెందిన 15 మంది మైనారిటీ లబ్ధిదారులకు రూ.9 లక్షల విలువైన వివిధ రకాల టూల్ కిట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య పంపిణీ చేశారు.

ధర్మసాగర్ మండలంలో కొత్తగా ఐదు కేటగిరీల కింద మొత్తం 729 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఇందులో 370 మంది వితంతువులకు రూ.7,45,920, 209 మంది దివ్యాంగులకు రూ.8,39,344, 44 మంది ఒంటరి మహిళలకు రూ.88,704, 102 మంది గీత కార్మికులకు రూ.2,05,632, నలుగురు చేనేత కార్మికులకు రూ.8,064 చొప్పున నెలవారీ పింఛన్లు అందనున్నాయి. మొత్తం రూ.18,87,664 ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు పింఛన్ల కోసం నాలుగైదేళ్లుగా ఎదురుచూస్తున్నారని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం ఐదు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల పింఛన్లు మంజూరు చేసిందని, ఇప్పటికే ఉన్న పింఛన్లతో కలిపి సుమారు 45 లక్షల మందికి ఏటా రూ.12 వేల కోట్లతో పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఇంకా అర్హులు ఎవరైనా మిగిలిపోతే సర్పంచులు, ఎంపీడీవోలు గుర్తించి దరఖాస్తులు చేయించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు కళ్లముందే కనిపిస్తున్నా కొందరు రాజకీయ అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. అధికారం కోల్పోయామన్న అసహనంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని విమర్శించారు.

గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలకు ఆశ చూపిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వెళ్లి సన్నబియ్యం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల అమలును పరిశీలించాలని సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాజకీయ ఉనికి కోసం అబద్ధపు ప్రచారాలు చేసే ప్రతిపక్షాలకు ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి గత మూడేళ్లలో సుమారు రూ.1,600 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. అండర్‌గ్రౌండ్ ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ కార్యాలయ సముదాయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ చారిత్రక పాత్ర ఉందని, రాజీవ్‌గాంధీ ఆశయాలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చట్టబద్ధత కల్పించారని గుర్తుచేశారు. మహిళలకు సర్పంచులుగా అవకాశాలు వచ్చినప్పుడు వారి భర్తలు వారినే స్వతంత్రంగా బాధ్యతలు నిర్వహించేలా ప్రోత్సహించాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ కుటుంబంలోని పరిణామాలను ప్రస్తావిస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఘాటుగా స్పందించారు. సొంత కుటుంబానికి చెందిన మహిళే బయటకు వచ్చి తమ కుటుంబంలోని వ్యక్తులపై, రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని ప్రజలు గమనించాలని అన్నారు. ఇంటి విషయాలను సాధారణంగా బయటపెట్టని మహిళే ఇంతలా మాట్లాడుతోందంటే ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని, గ్రామగ్రామాన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీల హక్కుల రక్షణకు లౌకిక శక్తులను బలోపేతం చేయాలని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శేషాద్రి, హనుమకొండ డీఆర్‌డీవో శ్రీనివాస్, తహసీల్దార్ భావ్ సింగ్, ఎంపీడీవో అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, పింఛన్ల లబ్ధిదారులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్