Devaruppula: దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి: పల్లా సుందర్

Devaruppula: దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత పల్లా సుందర్ రాంరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 30 Oct 2026 2:44 PM IST
Devaruppula
X

Devaruppula: దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి: పల్లా సుందర్

​జనగాం జిల్లా: దేవరుప్పుల మండలంలో కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

మండలంలో ఎండిపోతున్న పంటలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పల్లా సుందర్ రాంరెడ్డి ధ్వజమెత్తారు. రైతులు సాగునీరు అడిగితే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతుల కష్టాలను గాలికొదిలేసి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, రైతుల హక్కుల కోసం ప్రాణాలైనా అర్పిస్తామని హెచ్చరించారు.

పక్క నియోజకవర్గాల్లో అందుతున్న నీటి సరఫరాను చూసైనా స్థానిక ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలన్నారు. ఇప్పటికైనా దేవరుప్పుల మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, రైతాంగాన్ని ఆదుకోకపోతే కాంగ్రెస్ నాయకులకు ప్రజల ఆగ్రహం తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI