Palakurthy: పాలకుర్తి మండలంలో పట్టపగలే భారీ చోరీ!
Palakurthy: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో మిట్టమధ్యాహ్నం భారీ చోరీ. రూ. 68 వేల నగదు, 2 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు అపహరణ.
Palakurthy: పాలకుర్తి మండలంలో పట్టపగలే భారీ చోరీ!
Palakurthy: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దొంగలు బరితెగించారు. రాత్రి వేళల్లో మాత్రమే కాదు పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా వావిలాల గ్రామంలో మిట్టమధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. అందినకాడికి దోచుకెళ్లారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మిట్టమధ్యాహ్నం తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. వావిలాల గ్రామానికి చెందిన శిలా సమ్మయ్య కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలోని 68 వేల రూపాయల నగదుతో పాటు, సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉండటం, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి లబోదిబోమన్నారు. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ భరత్ కుమార్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ స్పష్టం చేశారు.
పట్టపగలే జరిగిన ఈ చోరీతో వావిలాల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.




