Hanamkonda: దాసు సురేష్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి బీసీ నేతలు

Hanamkonda: హనుమకొండలో తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం. పద్మశాలీ, బీసీల హక్కుల కోసం పోరాడుతున్న దాసు సురేష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Oct 2026 4:52 PM IST
Hanamkonda
X

Hanamkonda: దాసు సురేష్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి బీసీ నేతలు

హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో భర్తీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల నేపథ్యంలో పద్మశాలీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి హామీ ఇప్పుడు పద్మశాలీ సమాజంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన చేనేత కుటుంబాలకు, పద్మశాలీ సమాజానికి శాసనమండలిలో ప్రాతినిధ్యం లభించాలనే ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా చేనేత కార్మికుల సంక్షేమం, పద్మశాలీ సమాజ అభ్యున్నతి, బీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం నిరంతరంగా పోరాడుతున్న బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ పేరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి బలంగా వినిపిస్తోంది.

మగ్గం నుంచి మొదలైన ప్రస్థానం… ఉద్యమంగా మారిన జీవితం!

దాసు సురేష్ రాజకీయ ప్రస్థానం అధికార కేంద్రాల నుంచి ప్రారంభం కాలేదు. చేనేత మగ్గం దగ్గర, నేతన్నల కుటుంబాల జీవన పోరాటాల మధ్య ప్రారంభమైంది. చేనేత వృత్తి ఎదుర్కొంటున్న సంక్షోభం, నేతన్నల ఆర్థిక ఇబ్బందులు, వృత్తి పరిరక్షణకు ప్రభుత్వాల నుంచి అందాల్సిన సహకారం, పద్మశాలీ సమాజానికి దక్కాల్సిన గౌరవం ఆయనను సామాజిక ఉద్యమం వైపు నడిపించాయి.

గత రెండు దశాబ్దాలుగా వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా చేనేత కార్మికులు, పద్మశాలీలు, బీసీ వర్గాల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ అనేక పోరాటాలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు.

ఒకవైపు చేనేత వృత్తి పరిరక్షణ, నేతన్నల సంక్షేమం కోసం పోరాడుతూనే, మరోవైపు బీసీలకు జనాభా దామాషా ప్రకారం హక్కులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో తన ఉద్యమాన్ని విస్తరించారు.

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం… రాజకీయ భాగస్వామ్యమే అంతిమ గమ్యం!

బీసీ వర్గాలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకూడదని, రాష్ట్ర పరిపాలనలో, చట్టసభల్లో, నిర్ణయాధికార వ్యవస్థల్లో భాగస్వాములు కావాలనే బలమైన రాజకీయ దృక్పథంతో బీసీ రాజ్యాధికార సమితిని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన, కులగణన, బీసీ సబ్‌ప్లాన్, శాసనసభలు మరియు పార్లమెంటులో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ యువతకు నాయకత్వ అవకాశాలు వంటి కీలక అంశాలపై నిరంతరం గళమెత్తుతున్నారు.

తెలంగాణలోని 33 జిల్లాల్లో సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం, బీసీ యువత, మహిళలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా బీసీ రాజకీయ చైతన్యానికి బలమైన పునాది వేయడానికి కృషి చేస్తున్నారు.

ఉద్యమాలకు అండగా… సామాజిక న్యాయానికి గొంతుకగా!

చేనేత హక్కుల సభలు, పద్మశాలీ మహాసభలు, బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు, బస్తీ బాట కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ వంటి మహనీయుల ఆశయాల ప్రచారం ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం అనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

చేనేత కార్మికుల సమస్యల నుంచి బీసీల రాజకీయ హక్కుల వరకు, సామాజిక తెలంగాణ నిర్మాణం నుంచి అణగారిన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం వరకు అనేక అంశాలపై తన గళాన్ని నిరంతరం వినిపించారు.

అందుకే దాసు సురేష్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం అనేది కేవలం ఒక వ్యక్తికి పదవి కల్పించే అంశం మాత్రమే కాదు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సామాజిక ఉద్యమానికి, చేనేత సమాజం ఆకాంక్షలకు, బీసీల రాజకీయ ప్రాతినిధ్య పోరాటానికి గుర్తింపు కల్పించే అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది.

ముఖ్యమంత్రి హామీకి కార్యరూపం… పద్మశాలీ సమాజానికి రాజకీయ న్యాయం!

పద్మశాలీ సామాజిక వర్గానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీ నేపథ్యంలో దాసు సురేష్ తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతోనూ సంప్రదింపులు కొనసాగిస్తూ అధిష్ఠానం మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

తన సామాజిక సేవా ప్రస్థానం, చేనేత రంగానికి చేసిన కృషి, బీసీ ఉద్యమంలో పోషించిన పాత్ర, ప్రజా సమస్యలపై తనకున్న అవగాహనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవి వ్యక్తిగత గౌరవం కోసం కాదు… లక్షలాది గొంతుకలకు వేదిక కావాలి!

దాసు సురేష్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలనే డిమాండ్ వెనుక ఒక విస్తృతమైన సామాజిక ఆకాంక్ష ఉంది. చేనేత కార్మికుల దశాబ్దాల సమస్యలు, పద్మశాలీ సమాజానికి తగిన రాజకీయ గుర్తింపు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వర్గాల గొంతుకలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం లభించాలనే లక్ష్యం ఉంది.

చట్టసభల్లో ఇప్పటికే ప్రాతినిధ్యం పొందిన వర్గాల మాదిరిగానే, చేనేత కార్మికులు, బీసీ సామాజిక వర్గాల సమస్యలను లోతుగా అర్థం చేసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకులకు కూడా తగిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది.

రెండు దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసిన ఉద్యమ నాయకుడికి శాసనమండలిలో అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం సామాజిక సేవకు, అంకితభావానికి, బీసీ సాధికారతకు గౌరవం ఇచ్చినట్లవుతుంది.

చేనేత మగ్గం దగ్గర మొదలైన ఒక సామాజిక ఉద్యమ ప్రస్థానం శాసనమండలి వరకు చేరితే, అది కేవలం దాసు సురేష్‌కు లభించిన గౌరవం మాత్రమే కాదు… పద్మశాలీ సమాజానికి, చేనేత కార్మికులకు, యావత్ బీసీ వర్గాలకు దక్కిన రాజకీయ గౌరవంగా నిలుస్తుంది.

రెండు దశాబ్దాల సామాజిక సేవకు గుర్తింపు – పద్మశాలీ, బీసీలకు శాసనమండలిలో సముచిత ప్రాతినిధ్యం!

ఇదే నేడు పద్మశాలీ సమాజం, చేనేత కార్మికులు, బీసీ మేధావులు, సామాజిక ఉద్యమకారులు ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి కార్యరూపం కల్పిస్తూ, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పద్మశాలీ, బీసీ వర్గాల తరఫున బలంగా విజ్ఞప్తి చేద్దాం. సామాజిక సేవకు సముచిత గుర్తింపు… చేనేత సమాజానికి రాజకీయ గౌరవం… బీసీలకు శాసనమండలిలో బలమైన గొంతుక

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్