Parkal: పరకాలలో దుస్థితిలో దామర చెరువు.. పట్టించుకోని అధికారులు!

Parkal: పరకాలలో బతుకమ్మ నిమజ్జన కేంద్రమైన దామర చెరువు దుస్థితి. నాచు, గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారిన ఘాట్. మహిళల తీవ్ర ఆగ్రహం.

M PRABHAKAR, PARAKAL
Published on: 16 Oct 2026 2:00 PM IST
Parkal
X

Parkal: పరకాలలో దుస్థితిలో దామర చెరువు.. పట్టించుకోని అధికారులు!

పరకాల: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండగ ముంచుకొస్తున్నా, పరకాల పట్టణంలోని ప్రతిష్టాత్మక దామర చెరువు దుస్థితి మాత్రం మారలేదు. ఏళ్లుగా బతుకమ్మ నిమజ్జనానికి కేంద్రంగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు చెత్తకుప్పగా మారి దర్శనమిస్తోంది.

చెరువులో నీరు అడుగంటిపోయి, మొత్తం నాచు, గుర్రపుడెక్కతో కప్పేసుకుపోయింది. నిమజ్జన ఘాట్ పూర్తిగా బురద, రాళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి అపరిశుభ్రంగా తయారైంది. దుర్వాసన వెదజల్లుతూ రోగాలకు నిలయంగా మారింది.

ఏటా బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు వేలాది మంది మహిళలు సంప్రదాయ బద్ధంగా ఇక్కడే బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఘాట్ లోకి దిగాలంటేనే మహిళలు జంకే పరిస్థితి నెలకొంది. చీరలు కట్టుకొని బురదలో దిగలేక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పండగ వచ్చినప్పుడే హడావుడి చేసే మున్సిపల్ అధికారులు, ఏడాది పొడవునా చెరువు పట్టించుకోరా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.

పండగకు ముందే యుద్ధ ప్రాతిపదికన దామర చెరువులో పేరుకుపోయిన నాచు, చెత్తను తొలగించి, నీరు నింపి, నిమజ్జన ఘాట్ ను శుభ్రం చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL