Warangal: వరంగల్‌లో అర్ధరాత్రి దాటాక పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Warangal: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తెల్లవారుజామున పోలీసుల భారీ ఆకస్మిక తనిఖీలు. 107 మంది అదుపులోకి.. డ్రగ్స్ పరీక్షల్లో 29 మందికి పాజిటివ్.
Warangal: వరంగల్‌లో అర్ధరాత్రి దాటాక పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్!
Warangal: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు, సమాజ భద్రతకు తీవ్ర ముప్పు అని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందించి సాధారణ జీవనంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ తనిఖిలో భాగంగా రౌడీషీటర్లు, పాత నేరస్థులు, డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం ఉన్నవారు, అనుమానితులతో కలిపి మొత్తం 107 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు చేయగా, వారిలో 29 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తెలిపారు.
అలాగే సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను నిబందనల ప్రకారం స్వాధీనం చేసుకున్నామని, అలాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో మానవ ఆక్రమణ (PITA) యాక్ట్ చట్టం కింద ఒక కేసు నమోదు చేశామని తెలిపారు.
కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో మాట్లాడి ఆయా ప్రాంతాల్లోని నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించామని, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి కాలనీలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇకనుండి ఇదేవిదమైన ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, డ్రగ్స్ వినియోగం, విక్రయాలు లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే డయల్ 100 / 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని స్థానిక ప్రజలను కోరుతూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత వరంగల్ ఇంచార్జీ ఏసిపి నరసింహారావు మట్టేవాడ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మడికొండ, ఐటి కోర్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




