Warangal: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Warangal: వరంగల్ జిల్లా నర్సంపేట సంజీవని ఆశ్రమంలో బాలల వారోత్సవాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రారంభించారు.
Warangal: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Warangal: ఈనెల 14 నుండి 20వ తారీకు వరకు వారం రోజులపాటు జరగనున్న బాలల వారోత్సవాలను నర్సంపేట లోని డాక్టర్ మోహన్ రావు – వినోద దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారిణి రాజమణి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, బాలలందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణ కల్పిస్తూ వారు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. బాలల భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, ప్రతి బాలుడికి సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉమారాణి మాట్లాడుతూ బాలల అభివృద్ధి, సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకురాలు మరియు డిసిపిఓ బత్తిని కళ్యాణి, బాలల సంక్షేమ సమితి సభ్యులు షాహిదా బేగం, మధు, తహసీల్దార్ దేవేందర్, సీడీపీఓలు మధురిమ, జ్యోతి, షేర్ ఎన్జీవో కోఆర్డినేటర్ శిరీష, సీహెచ్ఎల్ కేస్ వర్కర్ ఎన్. మౌనిక, డీసీపీయూ ఔట్రీచ్ వర్కర్ రాజుల సుమన్, సంజీవని ఆశ్రమం నిర్వాహకురాలు రమ, జ్యోతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు మరియు బాలలు తదితరులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ బాలలతో సరదాగా గడిపారు. కోకో, కబడ్డీ, వ్యాసరచన, లెమన్ స్పూన్ పోటీలను నిర్వహించి బాలల్లో ఆనందోత్సవాలను నింపారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ కిరణ్, డాక్టర్ శ్రవణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.




