Warangal: బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సత్య శారద!

Warangal: ఉర్సులోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి, విద్యార్థినులకు అందిస్తున్న పౌష్టికాహారం, వసతి సౌకర్యాలను పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 4:02 PM IST
Warangal
X

Warangal: బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సత్య శారద!

Warangal: వరంగల్ ఉర్సులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, పౌష్టికాహారం నాణ్యత తీరును పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న ఆహారం, వసతి సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, ఆహారం అందించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలెక్టర్ ముచ్చటిస్తూ చలికాలంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన వెచ్చని దుస్తులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురుకులంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వాటిని తన దృష్టికి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ ద్వారా తెలియజేయాలని విద్యార్థినులకు సూచించారు.

విద్యార్థినులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత రెడ్డి ,ప్రిన్సిపాల్ అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్