Hanamkonda: వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం!
Hanamkonda: హన్మకొండ కలెక్టరేట్‌లో వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు.
Hanamkonda: వెట్టిచాకిరీ నిర్మూలనపై అవగాహన ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం!
Hanamkonda: వెట్టిచాకిరీపై అవగాహన కల్పించడం, బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343ను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ రథం వాహనాన్ని సోమవారం కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ప్రచార వాహనం హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వెట్టిచాకిరీ, కార్మికుల హక్కులు, దోపిడీకి గురైన సందర్భాల్లో ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న విధానాలపై ప్రజలకు, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికులకు అవగాహన కల్పించునుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ... వెట్టిచాకిరీ నిర్మూలనకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని, వెట్టిచాకిరీకి గురైన వ్యక్తులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, అవసరమైన సహాయాన్ని అందించడం కోసం సంబంధిత శాఖలు కృషి చేయాలని పేర్కొన్నారు.
వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు వెట్టిచాకిరీ చోటుచేసుకునే అవకాశం ఉన్న ఇతర పని ప్రదేశాల్లోని అసంఘటిత, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మిక రంగాలపై ఈ ప్రచారం ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
ఈ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారం అందిస్తుందని.... ఇందులో భాగంగా IEC (సమాచారం, విద్య, కమ్యూనికేషన్) సామగ్రిని ప్రజలకు అందించడంతో పాటు, ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికులకు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
కార్మికులకు తమ హక్కులపై అవగాహన లేకపోవడం, అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థల గురించి తెలియకపోవడం లేదా ప్రతీకార చర్యలకు భయపడటం వల్ల వెట్టిచాకిరీ అనేక సందర్భాల్లో వెలుగులోకి రాకుండా ఉండవచ్చని... అడ్వాన్స్‌లు, అప్పులు, బలవంతం, బెదిరింపులు, మోసం లేదా పని నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా కార్మికులు వెట్టిచాకిరీలో చిక్కుకునే అవకాశం ఉందని...
‘స్వేచ్ఛా రథం’ ద్వారా వెట్టిచాకిరీని ఎలా గుర్తించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ప్రభుత్వ అధికారులు ఎలా స్పందించగలరు అనే విషయాలపై క్షేత్ర స్థాయి లో తెలియజేయాలన్నారు.
ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ NGO కి సంబందించిన బృందం వెట్టిచాకిరి నిర్ములన పైన ప్రదర్శించిన నాటకం అందరిని ఆకట్టుకుంది.
అనంతరం ప్రభుత్వ అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా వెట్టిచాకిరీకి గురైన వ్యక్తులను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించడం ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రవి , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, భార్గవ్ కార్మిక శాఖ, పోలీసు శాఖ/యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), జిల్లా న్యాయ సేవల సంస్థ (DLSA), మహిళా, శిశు అభివృద్ధి శాఖ తదితర సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




