Hanumakonda: హనుమకొండలో త్వరలో కొత్త గ్రావెల్ పోర్టల్ ప్రారంభం!
Hanumakonda: హనుమకొండ జిల్లాలో గ్రావెల్ తరలింపు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు సమగ్ర గ్రావెల్ నిర్వహణ విధానాన్ని తెస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.
Hanumakonda: హనుమకొండలో త్వరలో కొత్త గ్రావెల్ పోర్టల్ ప్రారంభం!
Hanumakonda: గ్రావెల్ (మట్టి) తరలింపునకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు సమగ్ర గ్రావెల్ నిర్వహణ విధానం (ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను అమల్లోకి తీసుకురానున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమగ్ర గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేసేందుకు నూతన పోర్టల్ తీసుకువచ్చే అంశంపై మైనింగ్, రెవెన్యూ, సాంకేతిక అధికారులతో జిల్లా కలెక్టర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చే పోర్టల్ సంబంధించిన వివిధ అంశాలను గురించి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... నూతన విధానం అమల్లోకి రావడం ద్వారా చిన్న మొత్తాల్లో గ్రావెల్ అవసరమైన సందర్భాల్లోనూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, త్వరితగతిన అనుమతులు పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రహదారుల నిర్మాణం, రైతులు, ప్రజల అవసరాల మేరకు గ్రావెల్ తరలించేందుకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడమే కొత్త విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సాధ్యమైనంత త్వరగా, సుమారు ఐదు రోజుల నుంచి వారంలోపు అనుమతులు మంజూరు చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ పోర్టల్ నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు సీజీజీ సాంకేతిక బృందం శనివారం జిల్లాకు రానుందని తెలిపారు. రెండు బ్యాచ్‌లుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించి, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ( గిర్ధవర్లు ), పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు.
త్వరగా పోర్టల్‌ను ప్రత్యక్షంగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వాహనాల వివరాలను నమోదు చేసి, ప్రవేశ సమయం, నిష్క్రమణ సమయాన్ని పోర్టల్‌లో పొందుపరుస్తారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ అమలుతో అనధికార గ్రావెల్ తవ్వకాలు, తరలింపునకు అడ్డుకట్ట వేయడంతో పాటు, గ్రామస్థాయిలో చిన్నపాటి పనులకు అవసరమైన గ్రావెల్ పొందడం సులభతరం కానుంది.
ఈ సమావేశంలో జిల్లా మైనింగ్ శాఖ ఏడి రామాచారి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్. వెంకన్న, ఈడియం శ్రీధర్, సి సెక్షన్ సూపరింటెండెంట్ చల్లా ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




