Mulugu: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: సీసీఎల్‌ఏ!

Mulugu: భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, రీసర్వే కోసం మండలానికి రెండు బృందాలను కేటాయించాలని సీసీఎల్‌ఏ డి.ఎస్. లోకేష్ కుమార్ అదనపు కలెక్టర్లను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Nov 2026 4:47 PM IST
Mulugu
X

Mulugu: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: సీసీఎల్‌ఏ!

ములుగు: భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతోపాటు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విజిలెన్స్ కేసులు, భూదాన్ నివేదిక, రీసర్వే, హైకోర్టు కేసులు, భూభారతి పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, భూసేకరణ, భూముల క్రమబద్ధీకరణ అంశాలపై ఆయన సమీక్షించారు.

ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ, భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పాత, కొత్త దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

రీసర్వేను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తి చేసేందుకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను కేటాయించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియ వేగంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీవో నంబర్లు 59, 76 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. యూఎల్‌సీ భూములు, జీవో నంబర్ 118కు సంబంధించిన పెండింగ్ అంశాలపైనా సమీక్షించారు.

హైకోర్టు పరిధిలో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విజిలెన్స్ కేసులు, భూదాన్ నివేదిక, భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, ఏవో రాజ్‌కుమార్, పర్యవేక్షకులు మహేష్ బాబు, మంజుల, తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.