Hanamkonda: దీక్షా దివస్ నుంచి విజయ దివస్ వరకు 11 రోజుల పాటు బీఆర్ఎస్ కార్యక్రమాలు!
Hanamkonda: దీక్షా దివస్ నుంచి విజయ దివస్ వరకు 11 రోజుల పాటు వరంగల్ పశ్చిమంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దాస్యం తెలిపారు.
Hanamkonda: దీక్షా దివస్ నుంచి విజయ దివస్ వరకు 11 రోజుల పాటు బీఆర్ఎస్ కార్యక్రమాలు!
Hanamkonda: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలు, తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 29 న దీక్ష దివస్ నుంచి డిసెంబర్ 9న విజయ దివస్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11 రోజులపాటు పలు సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్లపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. 'కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో' అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, గాంధేయ మార్గంలో సాగించిన పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి సౌకర్యాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించారని తెలిపారు.
కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించగా, నవంబర్ 30న బీసీ, దివ్యాంగులు తదితర వర్గాల సమస్యలపై సంబంధిత ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం స్థానికులు చేసిన ఉద్యమాలను గుర్తుచేస్తూ, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ జీఎం కార్యాలయంలోనూ వినతిపత్రం సమర్పించనున్నారు.
డిసెంబర్ 1న న్యాయవాదుల సమావేశం, 2న తెలంగాణ ఉద్యమ ఘట్టాలను ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్, పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. 3న తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించి, అమరవీరులకు నివాళులర్పించనున్నారు. 4న కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వివిధ ప్రార్థనా మందిరాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నారు.
5న బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా సమైక్య భోజన కార్యక్రమం, డిసెంబర్ 7వ తేదీన విద్యార్థులతో తెలంగాణ ఉద్యమ చరిత్రపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, రాష్ట్ర సాధన ఉద్యమం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విద్యార్థులు చర్చించనున్నారు.
డిసెంబర్ 8న ఉదయం 11 గంటలకు జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం, మాటాముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ వారికి గౌరవం కల్పించనున్నారు.
డిసెంబర్ 9న విజయ దివస్ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోపాటు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు,విద్యార్థులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




