Hanumakonda: చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి.. బీఆర్టీయూ నేతలు!

Hanumakonda: చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలను వెంటనే ఆపాలని, ట్రైసిటీలో ప్రత్యేక సంతలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని బీఆర్టీయూ, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 1:16 PM IST
Hanumakonda
X

Hanumakonda: చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి.. బీఆర్టీయూ నేతలు!

Hanumakonda: చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి. పాల‌కులు కేవ‌లం కంటి తుడుపు చ‌ర్య‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ట్రైసిటీలో ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయాలి. బీఆర్టీయూ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు నాయిని ర‌వి. మూడేళ్ల‌లో ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి చిరు వ్యాపారుల పొట్ట‌కొడుతున్నారు.

పాల‌కుల‌కు చిత్త శుద్ధి ఉంటే వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారుల సంఘం బాధ్యులు ఎండీ ఇస్మాయిల్‌. అధికారులే అన్ని చేస్తే ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నుకున్న నాయిని రాజేంద‌ర్ రెడ్డి గారు మీరు ఎందుకు ఉన్నారు. ఏం చేస్తారు నాయిని కూల్చివేత‌లు, ఎగ‌వేత‌లు, కోత‌లు ఇదీ ఈ కాంగ్రెస్ మూడేళ్ల పాల‌న. బీఆర్ఎస్ నాయ‌కులు ఎస్కే మ‌హ‌మూద్‌.

హ‌నుమ‌కొండ ప‌ట్ట‌ణంలో చిరువ్యాపారుల స‌ముదాయాలు కూల్చివేత‌ల నేప‌థ్యంలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ హ‌నుమకొండ‌ జిల్లా కార్యాలయంలో బీఆర్టీయూ, చిరు వ్యాపార సంఘాల నేతల మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా బీఆర్టీయూ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు నాయిని ర‌వి మాట్లాడుతూ

చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేసి, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పండ్ల వ్యాపారుల దుకాణాల కూల్చివేత, చిరు వ్యాపారులపై అధికారుల చర్యల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఎమ్మెల్యేగా ఉన్న 15 ఏళ్ల కాలంలో చిరు వ్యాపారులపై ఇలాంటి దాడులు జరగలేదని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి హయాంలో మూడేళ్లలో చిరు వ్యాపారులపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, మున్సిపల్‌ అధికారులు, పోలీసులు తీసుకుంటున్న చర్యలతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. పేదల జీవితాలను నాశనం చేయకుండా, వారి జీవనోపాధిని కాపాడాలని కోరారు. పెద్ద వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకే చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా? అని ప్రశ్నించారు.

పండ్ల వ్యాపారుల దుకాణాల కూల్చివేతతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. వారికి జ‌రిగిన న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండీ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. చిరు వ్యాపారులపై జరుగుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

పెద్ద వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, పేద చిరు వ్యాపారుల పొట్టకొట్టడం ఏ విధమైన ప్రజాపాలన అని ప్రశ్నించారు. అధికారుల చర్యలతో వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 41 స్ఫూర్తికి అనుగుణంగా ప్రజల జీవనోపాధి, సామాజిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చిరు వ్యాపారుల సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజాసంఘాలు, మేధావులు, ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాకుండా, హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీలో చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గత మూడేళ్లలో కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయిలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపలేదని ఆరోపించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయ‌కులు ఎస్కే మ‌హ‌మూద్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులపై కాదు.. రోడ్ల‌ను ఆక్ర‌మించిన‌ పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోండని సూచించారు.

వరంగల్‌ నగరంలో చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. చిరు వ్యాపారులపై చర్యలు తీసుకునే అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పెద్ద వ్యాపారుల విషయంలో ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

మూడేళ్ల‌లో చిరు వ్యాపారుల‌పై ప‌లుసార్లు దాడులు జ‌ర‌గాయ‌ని, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి త‌న‌కు తెలియ‌కుండా జ‌రుగుతున్నాయ‌ని, అధికారులే కూల్చుతున్నార‌ని అన‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. అధికారులే అన్ని చేస్తే ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌తినిధిగా ఎన్నుకున్న నాయిని రాజేంద‌ర్ రెడ్డి గారు మీరు ఎందుకు ఉన్నారు. ఏం చేస్తారు నాయిని రాజేంద‌ర్ రెడ్డిని ప్ర‌శ్నించారు.

కూల్చివేత‌లు, ఎగ‌వేత‌లు, కోత‌లు ఇదీ ఈ కాంగ్రెస్ మూడేళ్ల పాల‌న అని విమ‌ర్శించారు. కాజీపేట బ్రిడ్జి వద్ద మూడేళ్లుగా కనీసం తట్టేడు మట్టిని పోయలేదని విమర్శిస్తూ, నగరంలో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.

చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సోదా కిరణ్, చిరు వ్యాపార సంఘ నాయకులు మహమ్మద్ ముర్తజా, హరిచంద్రు, మోయిన్, మైనార్టీ నాయకులు నాయీముద్దీన్, భవన నిర్మాణ రంగ కార్మిక నాయకులు ఇంజాల మల్లేశం, తేలు సారంగపాణి పాలడుగుల శివకుమార్ సిరికొండ బిక్షపతి ఎండి సాదిక్ నారాయణగిరి రాజు గంగరాజు రాజు, సదాంత్, సారిక, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్