Warangal: గంజాయి ఆరోపణలను నిరూపించాలి.. లేదంటే రాజీనామా చేయాలి!
Warangal: హన్మకొండలో బీఆర్ఎస్ యువ నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి మీడియా సమావేశం. ఎంజీఎం ఆసుపత్రి దాడులను ఖండన, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సవాల్.
Warangal: గంజాయి ఆరోపణలను నిరూపించాలి.. లేదంటే రాజీనామా చేయాలి!
Warangal: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువ నాయకులు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి హన్మకొండ నక్కలగుట్టలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని అన్నారు.
విద్య, వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్న రంజిత్ రెడ్డి.. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గంజాయి తాగుతాడని, యువతను చెడగొడుతున్నాడని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని రంజిత్ రెడ్డి అన్నారు. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు తాము అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
నాలుగుసార్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్‌ను ఎంజీఎం ఆసుపత్రికి ఎందుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వినయ్ భాస్కర్ పేరు వింటేనే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఎందుకు భయం అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చరిత్ర ఏమిటో, తమ చరిత్ర ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కంటే నగరంలో బ్యానర్లు ఏర్పాటు చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డేనా.. లేక ఆయన అల్లుడా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని వ్యాఖ్యానించారు.
తమతో తిరిగే యువకులను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రంజిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అల్లుడు అధికారులను పనులు చేయాలని ఎలా ఆదేశిస్తారని, ఆయనకు ఆ అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
తనపై చేసిన గంజాయి ఆరోపణలను ఎమ్మెల్యే నిరూపించాలని సవాల్ చేశారు. తాను గంజాయి సేవించలేదని నిరూపితమైతే నాయిని రాజేందర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
యువత ఎవరూ భయపడవద్దని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని దుగ్గంపూడి రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.




