Warangal: GWMC కార్మికుల వేతనాల తగ్గింపుపై దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్!
Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవుట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు తగ్గించడంపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Warangal: GWMC కార్మికుల వేతనాల తగ్గింపుపై దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్!
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను తగ్గించడం అత్యంత అన్యాయమైన, హేయమైన చర్య అని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు అన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, గతంలో అందుతున్న వేతనాలను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
GWMCలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్మిక విభాగం ఆధ్వర్యంలో దాస్యం వినయ్ భాస్కర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు GWMCలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.25,000 అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా, ఇప్పుడు కార్మికులను నాలుగు కేటగిరీలుగా విభజించి, వరంగల్ మహానగర పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 519 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను తగ్గించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికుల వేతనాలను వారి కష్టానికి, సేవలకు అనుగుణంగా రూ.16,500 నుంచి రూ.23,500 వరకు పెంచామని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా ఉన్న వేతనాలను తగ్గించడం కార్మికుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపినట్లేనని అన్నారు.
“కార్మికుల శ్రమతోనే నగర పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజా సేవలు కొనసాగుతున్నాయి. అలాంటి కార్మికుల కష్టాన్ని గుర్తించి వారి వేతనాలను పెంచాల్సింది పోయి తగ్గించడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి” అని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర సమితి ఎప్పటికీ అండగా ఉంటుందని, వేతనాల తగ్గింపు నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు కార్మికులతో కలిసి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో అందుతున్న వేతనాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు GWMCలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.25,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BRS కార్మిక విభాగం కన్వీనర్ నాయిని రవి, మున్సిపల్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు న్యాయవాది రామూర్తి, పలువురు కార్మిక నాయకులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




