Hanumakonda: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తప్పు!

Hanumakonda: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై విజయభాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 1:48 PM IST
Hanumakonda
X

Hanumakonda: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తప్పు!

Hanumakonda: వడ్డేపల్లి 60వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డివిజన్ ఇన్‌చార్జ్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ నాగరాజు, 58వ డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, డివిజన్ అధ్యక్షులు నవీన్, నాయకులు పున్నం తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారిపై, వారి కుటుంబ సభ్యులపై విజయభాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లలో జరగని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వేగవంతం చేశారని తెలిపారు. ముఖ్యంగా వరంగల్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడేలా నాలా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో పాటు, మీ సొంత ఊరైన వడ్డేపల్లి ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి పనులను నాయిని రాజేందర్ రెడ్డి గారు చేసి చూపించారని అన్నారు.

వడ్డేపల్లిలో శ్మశానవాటిక నిర్మాణం, రైతుల భూములను గ్రీన్ జోన్ నుంచి విముక్తి చేయించడం, పేదలకు వైద్య సేవల కోసం ఆసుపత్రి నిర్మాణం, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.

అదేవిధంగా సుమారు రూ.20 కోట్లతో వడ్డేపల్లి పరిసర ప్రాంతాల్లోని 58వ, 60వ డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, ముదిరాజ్ శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్‌కు రూ.50 లక్షల మంజూరు వంటి పనులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి చొరవకు నిదర్శనమని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను కూడా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలకు అందిస్తున్న ఘనత ఆయనదని తెలిపారు.

అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి యువత డ్రగ్స్, మద్యానికి బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ 2K, 5K, 10K, 20K రన్‌ల ద్వారా యువతలో ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.

రాజకీయాల్లో విమర్శలకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. అభివృద్ధి పనులపై చర్చించాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగకూడదని, ప్రజలకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. ఇకనైనా విజయభాస్కర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హుందాగా వ్యవహరించాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జనగం శ్రీనివాస్, కమల్, యుగేందర్, సాజిద్, కిషోర్, శ్రీకాంత్, మీనా, స్వప్న, ప్రసాద్, అక్మల్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్