Warangal: ఫారం-18 దరఖాస్తుల పరిశీలనలో నిబంధనలు కఠినంగా పాటించాలి!
Warangal: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు అదనపు సిఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశం.
Warangal: ఫారం-18 దరఖాస్తుల పరిశీలనలో నిబంధనలు కఠినంగా పాటించాలి!
Warangal: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన శుక్రవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన పట్టభద్రులందరికీ ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే విధానంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా స్వీప్ (SVEEP) కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఫారం-18 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
అర్హులైన పట్టభద్రుల నుంచి అందిన ఫారం-18 దరఖాస్తులను ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని, ఎలాంటి దరఖాస్తులు అనవసరంగా పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దరఖాస్తులతో సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ఇతర విద్యార్హత ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదుకు అర్హతలు
పట్టభద్రుల ఓటరు జాబితాను ప్రతి ద్వైవార్షిక ఎన్నిక లేదా ఉప ఎన్నికకు ముందు కొత్తగా (De Novo) రూపొందిస్తారని, గతంలో ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అభ్యర్థులు సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో సాధారణ నివాసితులై ఉండటంతో పాటు, అర్హత తేదీ 01.11.2026 నాటికి కనీసం మూడు సంవత్సరాల ముందే నిర్దేశిత విద్యార్హతను పొంది ఉండాలని వివరించారు.
31.10.2023 లేదా అంతకుముందు డిగ్రీ పరీక్ష ఫలితాలు ప్రకటించబడిన లేదా ప్రచురించబడిన పట్టభద్రులు మాత్రమే మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
మూడు సంవత్సరాల కాలపరిమితిని డిగ్రీ పట్టా ప్రదానోత్సవం తేదీ ఆధారంగా కాకుండా పరీక్ష ఫలితాలు ప్రకటించిన తేదీ ఆధారంగా లెక్కించాలని స్పష్టం చేశారు.
దరఖాస్తుల సమర్పణలో నిబంధనలు పాటించాలి
నేరుగా దరఖాస్తు చేసుకునే వారు విద్యార్హతకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలను అధికారులకు చూపించాలి. అసలు ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం,అవి సరైనవా లేదా , తిరస్కరించబడినవా అనే వివరాలు సంబధిత పరిశీలన అధికారి నమోదు చేయాలన్నారు.
తపాలా ద్వారా పంపే దరఖాస్తులకు విద్యార్హత ధ్రువపత్రాల ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలి. దరఖాస్తు దారులు సంబంధిత పట్టభద్రుల నియోజక వర్గ పరిధిలో సాధారణ నివాసితులుగా ఉండాలనే నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు
రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs), రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడానికి అనుమతి లేదని తెలిపారు.
విద్యాసంస్థల అధిపతులు తమ సంస్థల్లో పనిచేసే అర్హులైన సిబ్బంది దరఖాస్తులను సమర్పించవచ్చు. ఒకే చిరునామాలో నివసించే అర్హులైన కుటుంబ సభ్యుల తరఫున కూడా తగిన ధ్రువీకరణతో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ
అర్హులైన పట్టభద్రులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలను జతచేసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫారం-18 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్:
https://ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx
అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి
ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ విద్యాసంస్థల సిబ్బంది, పట్టభద్రులు, సాధారణ ప్రజలకు ఓటరు నమోదు అర్హతలు, దరఖాస్తు విధానంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలతో సంపూర్ణంగా దరఖాస్తులు సమర్పించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
సంబంధిత ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల అధికారులు అర్హులైన పట్టభద్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కలెక్టర్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,హన్మకొండ అదనపు కలెక్టర్ రవి, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఆర్డీఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.




