Palakurthy: జనగామ జిల్లాలో విషాదం - పక్షుల వేటగాళ్ల ఉచ్చుకు 21 గొర్రెలు మృతి!

Palakurthy: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెరలో విషాదం. వేటగాళ్లు చల్లిన విషపు తవుడు తిని ఏకంగా 21 గొర్రెలు మృతి. కన్నీరుమున్నీరవుతున్న రైతులు.

S MAHENDER, PALAKURTHI
Published on: 28 Sept 2026 12:50 PM IST
Palakurthy
X

Palakurthy: జనగామ జిల్లాలో విషాదం - పక్షుల వేటగాళ్ల ఉచ్చుకు 21 గొర్రెలు మృతి!

Palakurthy: ​బొమ్మెర గ్రామంలో పక్షుల వేటగాళ్లు పన్నిన విషపు వల అమాయక మూగజీవాల ప్రాణాలను బలితీసుకుంది. మేత కోసం వెళ్లిన ఏకంగా 21 గొర్రెలు విషపు గుళికల ప్రభావంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఒకేసారి ఇన్ని జీవాలు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. పక్షుల వేట కోసం దుండగులు వేసిన విషపు తవుడే ఈ ఘోరానికి కారణమని వెటర్నరీ వైద్యులు నిర్ధారించారు.

​పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో గుండెలు పిండే దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతులు సుడిగెల రాజు, జున్ను వెంకన్నలకు చెందిన గొర్రెల మంద రోజూలాగే గ్రామ సమీపంలోని పశుగ్రాస ప్రాంతానికి మేత కోసం వెళ్లింది. అయితే, అనుమానాస్పద స్థితిలో ఏకంగా 21 గొర్రెలు వరుసగా కుప్పకూలి ప్రాణాలు విడిచాయి. కళ్లముందే జీవాలు గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంటే రైతులు గుండెలవిసేలా రోదించారు.

​రైతుల సమాచారంతో రంగంలోకి దిగిన పశువైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల అనంతరం డాక్టర్లు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. గొర్రెల కడుపులో విషపు గుళికలతో కూడిన తవుడు ఆనవాళ్లు లభ్యమైనట్లు స్పష్టం చేశారు.

​కొందరు గుర్తుతెలియని దుండగులు పక్షులను వేటాడేందుకు బహిరంగ పశుగ్రాస ప్రదేశాలలో విషపు గుళికలు కలిపిన తవుడును చల్లినట్లు గుర్తించారు. ఆ విషపు తవుడును మేతగా భావించి తిన్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. చేతికొచ్చిన జీవాలు మృత్యువాత పడటంతో తమకు తీరని ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

​ఈ విషపు గుళికలు వేసిన వేటగాళ్లు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే కోణంలో అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అమాయక జీవాల ప్రాణాలు తీసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI