Vizianagaram: భోగాపురం ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా

Vizianagaram: భోగాపురం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను విజయనగరం మహారాజా ఆస్పత్రి వద్ద పరామర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు; ప్రభుత్వ సాయంపై భరోసా.

SHIVA, BHIMILI
Published on: 24 Nov 2026 4:05 PM IST
Vizianagaram
X

Vizianagaram: భోగాపురం ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటా

విజయనగరం: భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయనగరం మహారాజా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. భీమిలి నియోజకవర్గానికి చెందిన వాకలపూడి శ్రీను, కుసుమ రంజని, బొర్రా సతీష్, బొర్రా శృతి, కొండపు సూరిబాబు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని తెలిపారు.

మృతులకు చిన్న పిల్లలు ఉన్నారని, ప్రభుత్వపరంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలన్నది ఆలోచిస్తామన్నారు. పార్టీ సభ్యత్వం ఉందని స్థానిక తెదేపా నేతలు చెప్పారని, అదే నిజమైతే ఇన్స్యూరెన్స్ వస్తుందని పేర్కొన్నారు. పౌర్ణమి సందర్భంగా దైవ దర్శనానికి అర్ధరాత్రి భీమిలి నుంచి శ్రీముఖలింగం థార్ వాహనంలో బయలుదేరిన వారికి సరిగా నిద్ర లేకపోవడం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని వెల్లడించారు.

సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశానని, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తో మాట్లాడి తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకున్నానన్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్లు గరే సదానంద, గాడు చిన్ని కుమారి లక్ష్మి, సాయి తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI