Vizianagaram: విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్!
Vizianagaram: విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణ, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్షించారు.
Vizianagaram: విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్!
విజయనగరం: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయనగరాన్ని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తమ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్-కార్డ్ (NCORD), త్రిశూల్ కార్యక్రమం, మహిళలు మరియు బాలికల సంరక్షణ, బాల్యవివాహాల నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విద్యాసంస్థల పరిసరాల్లో 'సేఫ్ క్యాంపస్ జోన్' నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ యువత మత్తుకు బానిసలు కాకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే బాల్యవివాహాల నివారణ, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. బాల్య వివాహలవల్ల కలిగే అనర్ధాలు, ట్రాఫికింగ్ తదితర అంశాలపై పాఠశాల స్థాయిలోనే బాలికలకు అవగాహన కల్పించాలని డిఈఓను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని కలెక్టర్ స్పష్టం చేశారు. బాలికలు, మహిళల సంరక్షణతోపాటు గృహ హింస ను అరికట్టేందుకు కృషి చేయాలని ఐసిడిఎస్‌ను ఆదేశించారు. అన్ని రకాల రవాణా వాహనాలకు ట్రాకింగ్ పరికరాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను అన్ని ఆసుపత్రుల్లో చేర్చుకొని, వెంటనే చికిత్సను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ఎస్‌పి ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, జాతీయ రహదారిపై రద్దీ ప్రాంతాలవద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చైన్‌లింక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్మెట్ వినియోగంపై అన్ని శాఖలు సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో
2026 నవంబర్ 26 నాటికి జిల్లాలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద 27 కేసులు నమోదు చేసి 661.517 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 128 మందిని అరెస్టు చేయగా, గతేడాది 87 కేసుల్లో 1,176.521 కిలోల గంజాయి సీజ్ చేసి 274 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై కఠిన చర్యల్లో భాగంగా 'పిట్ ఎన్‌డీపీఎస్' చట్టం కింద 22 మందిపై, పీడీ (PD) యాక్ట్ కింద 8 మందిపై నిర్బంధ ఉత్తర్వులు అమలు చేయడంతో పాటు, ఆర్థిక దర్యాప్తులో భాగంగా 5 కేసుల్లో రూ. 3,56,80,042 విలువైన ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. అంతేకాకుండా 'ఆపరేషన్ వజ్రప్రహార్' కింద మెడికల్ షాపులపై 31 దాడులు (ఆపరేషన్ గరుడ), 68 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, రైళ్లలో 6 ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, విద్యాసంస్థల వద్ద కోట్పా (COTPA) చట్టం కింద 2,053 చలాన్లు విధించి రూ. 2,92,310 జరిమానా వసూలు చేశారు.
ఈ జూమ్ సమావేశంలో జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఈగిల్ ఏఎస్పీ, డిటిసి మణికుమార్, డీఈవో మాణిక్యం నాయుడు, ఐసీడీఎస్ పీడీ బాలామణి, ఐరాడ్ (iRAD) మేనేజర్ శ్రీధర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సాయిరాం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




