Vizianagaram: బతికున్నప్పుడే కాదు.. చావులోనూ తప్పని తిప్పలు: ఉప్పొంగుతున్న వాగులో మృతదేహాల తరలింపు!
Vizianagaram: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో దారుణ పరిస్థితి నెలకొంది.
Vizianagaram: బతికున్నప్పుడే కాదు.. చావులోనూ తప్పని తిప్పలు: ఉప్పొంగుతున్న వాగులో మృతదేహాల తరలింపు!
Vizianagaram: బతికినంత కాలం కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే గ్రామీణులకు, కనీసం చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా సాగిపోయే అవకాశం లేకుండా పోతోంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో వెలుగుచూసిన హృదయవిదారక ఘటనే ఇందుకు నిదర్శనం. గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, చివరి ప్రయాణంలోనూ ప్రజలు పడుతున్న కష్టాలు అందరినీ కలచివేస్తున్నాయి.
పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి మార్గం లేదు. గ్రామానికి, స్మశానవాటికకు మధ్య ‘ఏడుంపుల గెడ్డ’ అనే వాగు అడ్డంగా ప్రవహిస్తోంది. మామూలు రోజుల్లో ఎండిపోయి ఉండే ఈ వాగు, వర్షాకాలంలో లేదా వర్షాలు కురిసినప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ చలిని తట్టుకోలేక గ్రామానికి చెందిన సామిరెడ్డి పరదేశమ్మ (65), నింగిరెడ్డి లక్ష్మునాయుడు (63) అనే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఒకే గ్రామంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఊరిలో తీవ్ర శోకఛాయలు అలుముకున్నాయి.
అయితే, వర్షాల కారణంగా ఏడుంపుల గెడ్డ వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో శ్మశానవాటికకు వెళ్లేందుకు వేరే దారి లేకపోయింది. దీంతో గ్రామస్థులు చేసేది లేక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని, ఉధృతంగా పారుతున్న వాగులోనే నడుచుకుంటూ ఇద్దరి మృతదేహాలను స్మశానవాటికకు తరలించారు. ఈ కంటతడి పెట్టించే దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోయాయి.
ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు సరిపడా రహదారిని నిర్మించడంతో పాటు వాగుపై బ్రిడ్జిని ఏర్పాటు చేసి తమ శాశ్వత సమస్యకు ముక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నారు.




