Vizianagaram: సీతానగరం మండలానికి ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే బోనెల
Vizianagaram: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సీతానగరం మండలం నిడగల్లులో కూటమి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Vizianagaram: సీతానగరం మండలానికి ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే బోనెల
విజయనగరం: పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లు గ్రామాన్ని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాపల్లి అనురాధ, ఎంపీటీసీ అభ్యర్థి శనపతి ఉమాతో కలిసి ఆయన నిడగల్లు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, నిడగల్లు గ్రామం తనకు సెంటిమెంట్‌తో కూడిన ప్రత్యేకమైన గ్రామమని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామంలో రహదారులు, కాలువల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
గ్రామ అభివృద్ధిని కొంతమంది వైసీపీ నాయకులు వివిధ కారణాలతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అభివృద్ధి పనులు మాత్రం ఆగబోవని స్పష్టం చేశారు.గ్రామంలో ఇంకా మిగిలి ఉన్న రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, గోశాలల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.




