Parvathipuram: తుపాను హెచ్చరికలతో గిరిజన సంక్షేమ శాఖ అప్రమత్తం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో తుపాను హెచ్చరికలు: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల అధికారులతో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయశాంతి జూమ్ సమీక్ష, కీలక ఆదేశాలు.
Parvathipuram: తుపాను హెచ్చరికలతో గిరిజన సంక్షేమ శాఖ అప్రమత్తం!
పార్వతీపురం: తుపాను ప్రభావం దృష్ట్యా గిరిజన ఆశ్రమ పాఠశాలలు గురుకులాల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు అన్ని ఏటీడబ్ల్యూఓలు (ATWO), గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ట్రైబల్ వెల్ఫేర్ డి డి విజయశాంతి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుపాను సమయంలో విద్యార్థుల రక్షణే మొదటి ప్రాధాన్యత అని, పాఠశాలల అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లనివ్వకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని స్పష్టం చేశారు.
అలాగే పాఠశాలల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ లైట్లు, ఇన్వర్టర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, కనీసం 3 నుండి 5 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, సురక్షితమైన తాగునీరు మరియు అత్యవసర మందుల నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలోని శిథిల భవనాలు, పాత విద్యుత్ వైర్లు, బలహీనంగా ఉన్న చెట్ల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏ క్షణంలోనైనా స్థానిక రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తేల్చిచెప్పారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అధికారులు మరియు ఉపాధ్యాయులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.




