Parvathipuram: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!
Parvathipuram: మన్యం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అత్యవసర సహాయానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.
Parvathipuram: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!
Parvathipuram: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. వర్షాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కల్వర్టులు, రహదారులపై ప్రవహిస్తున్న వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ హెచ్చరించారు. వర్షాల సమయంలో పాత భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు.
లోతట్టు ప్రాంతాలు, గిరిశిఖర గ్రామాల్లో నివసించే ప్రజల భద్రత కోసం అవసరమైన పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.
జిల్లా ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కోరారు.




