Vizianagaram: విజయనగరంలో ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ అప్పారావు జయంతి!

Vizianagaram: విజయనగరం కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ అప్పారావు 164వ జయంతి. గురజాడ సాహిత్యాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 21 Sept 2026 2:22 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ అప్పారావు జయంతి!

Vizianagaram: న‌వ‌యుగ వైతాళికుడు గుర‌జాడ వేంక‌ట అప్పారావు సాహిత్యం శాశ్వ‌తంగా నిలిచి ఉంటుంద‌ని, ఈ సంప‌ద‌ను భావిత‌రాల‌కు అందించేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల‌ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ పిలుపునిచ్చారు. మొట్ట‌మొద‌టిసారిగా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ప్ర‌భుత్వ ఉత్స‌వంగా మ‌హాక‌వి 164వ జ‌యంతోత్స‌వాన్ని సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ను, గుర‌జాడ జ‌యంతిని రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఉత్స‌వంగా ప్ర‌క‌టింప‌జేయ‌డంలో విశేషంగా కృషిచేసినందుకు ఘ‌నంగా స‌న్మానించి, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముందుగా గుర‌జాడ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, మ‌న సంస్కృతిని, సంప్ర‌దాయాలు, విలువైన సాహిత్యాన్ని సంర‌క్షించుకోవ‌డంత‌పాటు, భావిత‌రాల‌కు అందించాల‌ని కోరారు. సుమారు 120 ఏళ్ల క్రితం ఉమ్మ‌డి విశాఖ‌జిల్లా నుంచి మ‌లేషియాకు వ‌ల‌స వెళ్లిన తెలుగువారి ఉదంతాన్ని వివ‌రించారు. వారంతా తెలుగు అసోసియేష‌న్‌గా ఏర్పాటై ఇప్ప‌టికీ త‌మ సంస్కృతి, సంప్ర‌దాయాలు, అల‌వాట్ల‌ను వారి పిల్ల‌ల‌కు అంద‌జేస్తుండ‌టం గొప్ప విష‌యంగా పేర్కొన్నారు. వారి ఇళ్ల‌లో తెలుగు మాట్లాడుతుండం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ముఖ్యంగా జెన్ జెడ్ కూడా ఇప్ప‌టికీ అక్క‌డ తెలుగు సంప్ర‌దాయాల‌ను పాటిస్తున్నార‌ని ప్ర‌శంసించారు.

మ‌హాక‌వి గుర‌జాడ జ‌యంతిని రాష్ట్ర ఉత్స‌వంగా ప్ర‌క‌టించినందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి, ఉప ముఖ్య‌మంత్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

జిల్లా ఇన్‌ఛార్జి క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ మాట్లాడుతూ, దేశ‌మంటే మ‌ట్టికాదోయ్‌ దేశ‌మంటే మ‌నుజులోయ్ అన్న గుర‌జాడ క‌విత‌ను ప్ర‌స్తావిస్తూ, సుమారు వందేళ్ల క్రితం గుర‌జాడ రాసిన ఈ ప‌లుకులు విశ్వ‌వ్యాప్తంగా దేశ‌భ‌క్తికి ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని కొనియాడారు. ఆయ‌న క‌న్యాశుల్కం గొప్ప సామాజిక స్పృహ‌కు నిద‌ర్శ‌నంగా పేర్కొన్నారు. వాడుక భాష‌లో చేసిన‌ గుర‌జాడ ర‌చ‌న‌లు, గొప్ప మాన‌వ‌తా విలువ‌ల‌కు ప్ర‌తీక‌గా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా చొచ్చుకుపోయాయ‌ని అన్నారు. గుర‌జాడ మాన‌వ‌త, సామాజిక‌ దృక్ఫ‌థం ప్ర‌తిఒక్క‌రికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ ఎంఎల్‌సి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు మాట్లాడుతూ, మ‌హాక‌వి జ‌యంతిని రాష్ట్ర ఉత్స‌వంగా ప్ర‌క‌టింప‌జేస్తూ, ప్ర‌భుత్వం నుంచి జీఓ193 విడుద‌ల చేయించినందుకు, మంత్రి కొండ‌ప‌ల్లిని ప్ర‌త్యేకంగా అభినందించారు. గుర‌జాడ సాహిత్యాన్ని, రామాయ‌ణ‌, మ‌హాభార‌త క‌థ‌ల‌ను, మ‌న పౌరాణికాల‌ను వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం ద్వారా, యువ‌త‌కు చేరువ చేసేందుకు కృషి చేయాల‌ని సూచించారు. త‌ద్వారా యువ‌త మంచి వ్య‌క్తుల‌గా ఎదిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

గుర‌జాడ కుటుంబ స‌భ్యురాలు ఇందిర‌, గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ప్ర‌తినిధులు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, డాక్ట‌ర్ ఏ.గోపాల‌రావు, లోక్‌స‌త్తా రాష్ట్ర అధ్య‌క్షులు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ, గుర‌జాడ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు.

కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ సిహెచ్ స‌త్తిబాబు, డిఈఓ మాణిక్యంనాయుడు, సిపిఓ బాలాజీ, డిప్యుటీ క‌లెక్ట‌ర్ ముర‌ళి, ఆర్‌డిఓ సుధాసాగ‌ర్‌, గృహనిర్మాణ‌శాఖ పిడి ముర‌ళి, ఇత‌ర అధికారులు, గుర‌జాడ కుటుంబ స‌భ్యులు, సాంస్కృతిక స‌మాఖ్యల‌ ప్ర‌తినిధులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. గుర‌జాడ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించిన పోటీల విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌దానం చేశారు. గుర‌జాడ కుటుంబ స‌భ్యుల‌ను ఈ సంద‌ర్భంగా స‌న్మానించారు. మ‌హారాజా సంగీత క‌ళాశాల విద్యార్ధుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.