Kurupam: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో కురుపాం జడ్పీటీసీ వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్. ఎస్టీ జనరల్ రిజర్వేషన్‌తో చైర్మన్ పదవిపై ఆసక్తికర చర్చ.

V.SESHU	, KURUPAM
Published on: 10 Nov 2026 10:21 AM IST
Kurupam
X

Kurupam: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్!

Kurupam: నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. జడ్పీ చైర్మన్ పదవిని అధికారికంగా ఎస్టీ జనరల్ కేటగిరీకి కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుపాం జడ్పీటీసీగా 3,656 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ పేరు చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. నూతన జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా ఆయనకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారీ మెజార్టీతో సత్తా ఇప్పుడు జిల్లా పీఠంపై గురి!

కురుపాం జడ్పీటీసీ ఎన్నికల్లో సాధించిన 3,656 ఓట్ల మెజార్టీ వీరేష్ చంద్రదేవ్ రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల బరిలో విజయాన్ని అందుకున్నారు. తాజాగా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ జనరల్ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆయన పేరుపై చర్చ మరింత ఊపందుకుంది. భారీ మెజార్టీతో గెలుపొందిన నాయకుడికి జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

మూడు తరాల రాజకీయ అనుబంధం.. ప్రత్యేక కుటుంబ నేపథ్యం

వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆయన కుటుంబానికి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. తండ్రి వైరిచర్ల ప్రదీప్ దేవ్ గతంలో పార్వతీపురం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. పెదనాన్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ మాజీ కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. మామయ్య అశోక్ గజపతి రాజు ప్రస్తుతం గోవా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వీరేష్ చంద్రదేవ్ విద్యావేత్తగా కూడా తనదైన గుర్తింపు కలిగి ఉన్నారు.

2024లో జగదీశ్వరి విజయానికి వెన్నుదన్ను

కురుపాం నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం వీరేష్ చంద్రదేవ్ విశేషంగా కృషి చేశారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గెలుపు బాధ్యతను తీసుకుని ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఆమె విజయానికి తన వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా కొనసాగుతున్నారు.

కురుపాం నుంచి జిల్లా రాజకీయాల్లో కీలక స్థానం దిశగా?

గిరిజన ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాలకు నిధుల సమీకరణ వంటి అంశాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో కురుపాం నియోజకవర్గానికి ఈ పదవి దక్కితే ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని స్థానికంగా ఆశాభావం వ్యక్తమవుతోంది. వీరేష్ చంద్రదేవ్‌కు అవకాశం కల్పిస్తే నూతన జిల్లాలో తొలి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.

అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ!

ఒకవైపు ఎస్టీ జనరల్ రిజర్వేషన్.. మరోవైపు భారీ మెజార్టీ.. ఇంకోవైపు రాజకీయ కుటుంబ నేపథ్యం, పార్టీ పట్ల అనుబంధం.. ఈ పరిణామాలన్నీ వీరేష్ చంద్రదేవ్ పేరును జడ్పీ చైర్మన్ చర్చల్లో నిలుపుతున్నాయి. అయితే చైర్మన్ ఎంపికలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.

నూతన పార్వతీపురం మన్యం జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ చరిత్ర సృష్టిస్తారా? కురుపాం నియోజకవర్గానికి జిల్లా పరిషత్ పీఠం దక్కుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికారిక నిర్ణయం వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM