Kurupam: పూతికవలసలో నేలమట్టమైన అరటి తోటలు!

Kurupam: కురుపాం మండలం పూతికవలసలో ఈదురుగాలుల బీభత్సం: 30 ఎకరాల్లో నేలమట్టమైన అరటి తోటలు, చేతికందే దశలో భారీ పంట నష్టం.. పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు.

V.SESHU	, KURUPAM
Published on: 24 Sept 2026 9:03 PM IST
Kurupam
X

Kurupam: పూతికవలసలో నేలమట్టమైన అరటి తోటలు!c

కురుపాం, సెప్టెంబర్ 24: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పూతికవలస గ్రామంలో ఈదురు గాలులు అరటి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వీచిన బలమైన గాలుల ప్రభావంతో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి.

గెలలు వేసి పండ్ల దిగుబడికి సిద్ధంగా ఉన్న అరటి చెట్లు మొదళ్లతో సహా విరిగి పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పచ్చని గెలలతో కళకళలాడాల్సిన తోటలు ఒక్కసారిగా నేలకొరిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ ప్రాంతంలో మరిశర్ల అనిల్ 6 ఎకరాలు, తంగుడు వెంకట నాయుడు 4 ఎకరాలు, గొట్టాపు చిన్నమనాయుడు 3 ఎకరాలు, యాములపల్లి జానకి 2 ఎకరాలు, తిరుపతిరావు 2 ఎకరాలతో పాటు మరికొందరు రైతులు కలిపి సుమారు 30 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. గాలుల కారణంగా పంట పూర్తిగా దెబ్బతినడంతో ఒక్కో రైతుకు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

"అప్పులు చేసి అరటి సాగు చేశాం. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు కారణంగా మొత్తం పంట నేలమట్టమైంది. ఇప్పుడు ఎలా కోలుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంట నష్టాన్ని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM