Kurupam: నాటుసారా తయారీపై ఎక్సైజ్ ఉక్కుపాదం 6400 లీటర్ల ఊట ధ్వంసం
Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు. 6,400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం, 100 లీటర్ల నాటుసారా స్వాధీనం, ఒకరు అరెస్ట్.
Kurupam: నాటుసారా తయారీపై ఎక్సైజ్ ఉక్కుపాదం 6400 లీటర్ల ఊట ధ్వంసం
కురుపాం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై సంయుక్త దాడులు నిర్వహించడంతో పాటు, అక్రమంగా నాటుసారా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటను ధ్వంసం చేయగా, మరో ఘటనలో 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
కె. రాహుల్ దేవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 2న ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని సందుబడి, రేగులపాడు గ్రామాల్లో ఒడిశా పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారంతో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 6,400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటతో పాటు, రవాణాకు సిద్ధంగా ఉంచిన 70 లీటర్ల నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు. సరిహద్దు గ్రామాల్లో నాటుసారా తయారీ, రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కురుపాం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని జోగిరాజుపేట కూడలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన అధికారులు, ఏపీ 35 ఎల్ 3188 నంబరు గల అపాచీ ద్విచక్ర వాహనంపై రెండు రబ్బరు ట్యూబుల్లో అక్రమంగా తరలిస్తున్న 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో చినమేరంగి గ్రామానికి చెందిన బొమ్మాళి అనిల్‌పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు వెల్లడించారు. అతడికి నాటుసారా సరఫరా చేసిన సందుబడి గ్రామానికి చెందిన రత్నాల జ్యోతిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ దాడుల్లో విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ AES ఎం.వి. గోపాలకృష్ణ సిబ్బంది, పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ సిబ్బంది, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ, పాలకొండ, కురుపాం ట్రైనీ ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్లు వెంకట్ రెడ్డి, రాంబాబు, కురుపాం ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల్లో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.




